దగ్గుబాటి పురంధేశ్వరిపై చర్యలు తీసుకోవాలి
నిప్పులు చెరిగిన ఎంపీ విజయ సాయి రెడ్డి
అమరావతి – వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు (ఎంపీ) విజయ సాయి రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం విజయ సాయి రెడ్డి ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
పురంధేశ్వరి కనీస ఇంగిత జ్ఞానం అన్నది లేకుండా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును, న్యాయమూర్తులను అగౌరవ పరుస్తూ, కించ పరిచే విధంగా మాట్లాడటం భావ్యం కాదన్నారు.
ధర్మాసనం తిరుమల లడ్డుప్రసాదాల విషయంలో చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతూ వారి ప్రతిష్టకు భంగం కలిగించడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. ఇది పూర్తిగా కోర్ట్ ధిక్కారం కిందకు వస్తుందన్నారు. వెంటనే దగ్గుబాటి పురంధేశ్వరిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎంపీ విజయ సాయి రెడ్డి.
పురంధేశ్వరి మొత్తం మీద సుప్రీంకోర్టుదే తప్పు అని తేల్చేసిందన్నారు. చంద్రబాబు రాజ్యాంగ పదవిలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఏదైనా అనొచ్చంట. ఏమమ్మా! మరి న్యాయ వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థే కదా! తమరికి తెలియదా?
అంత చిన్న విషయానికే న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తారా అని చిరాకు పడి పోవడం , తన మరిదికి వత్తాసు పలకడం దారుణమని పేర్కొన్నారు. ఆమెది బావా’తీతమైన ఆవేదన అనుకోవాలి మరి అంటూ ఎద్దేవా చేశారు.
కోర్టులు, దేవుడి కంటే చంద్రబాబే గొప్పవాడు అన్నట్లుంది ఈమె వైఖరి. ఈ వందేళ్లలో తిరుమల ఆలయానికి నారా, నందమూరి చేసిన డ్యామేజి ఎవరూ చేయ లేదన్నారు విజయ సాయి రెడ్డి.
చంద్రబాబు నాయుడు హిందువుల మనోభావాలను లడ్డు ప్రసాదాల విషయంలో దెబ్బ తీయటమే కాకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.