DEVOTIONAL

తిరుమ‌ల‌లో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Share it with your family & friends

ఏడాదిలో నాలుగు సార్లు నిర్వహిస్తామ‌న్న ఈవో

తిరుమ‌ల – తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు జ‌ర‌గ‌నున్న‌ సాలకట్ల బ్రహ్మోత్సవాలను పుర‌స్క‌రించుకుని కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఆగ మోక్తంగా జరిగింది.

ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె.శ్వామ‌ల‌రావు మాట్లాడారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ లోని అన్ని విభాగాలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఈ కోయిల్ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తామన్నారు.

కాగా ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు.

ఈ సమయంలో స్వామి వారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు.

స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంత‌రం భక్తులను దర్శనానికి అనుమతించారు.

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం దృష్ట్యా అష్టదళ పాద పద్మారాధన, విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను టీటీడీ రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో టీటీడీ అద‌న‌పు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవో గౌతమి, సివిఎస్వో శ్రీధర్, ఆలయ డెప్యూటీ ఈఓ లోకనాథం, పేష్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.