ప్రాయశ్చిత్త దీక్ష విరమించిన పవన్ కళ్యాణ్
అన్నదాన సత్రంలో భక్తులతో కలిసి భోజనం
తిరుమల – ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. వారహి డిక్లరేషన్ ను శ్రీవారి పాదాల చెంత వద్ద ఉంచారు. అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్రంలో అన్న ప్రసాదం స్వీకరించారు.
సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. 11 రోజులపాటు సాగిన ఆయన దీక్షలో భాగంగా ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపధ్యంలో సనాతన ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత భుజాలకెత్తుకుని ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.
మంగళవారం రాత్రికి అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు పవన్ కళ్యాణ్. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తన ఇద్దరు కుమార్తెలు ఆద్య కొణిదెల, పలీనా అంజని కొణిదెలలతో కలసి మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని దర్శించుకున్నారు.
తన ఇద్దరు కుమార్తెలతో స్వామి వారి దర్శనానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేసి వారాహి డిక్లరేషన్ ని స్వామి వారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ రంగనాయకుల మండపంలో వేద పండితులు పవన్ కళ్యాణ్ కు ఆశీర్వచనం చేసి స్వామి వారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు.