సమంతకు సారీ కానీ కేటీఆర్ ను వదలను
నిప్పులు చెరిగిన మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్ – అక్కినేని నాగ చైతన్య, సమంత విడి పోయేందుకు ప్రధాన కారకుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై సినీ రంగానికి చెందిన ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. దీంతో పార్టీకి తీవ్ర డ్యామేజ్ జరగడంతో రంగంలోకి దిగారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.
ఆయన మంత్రి కొండా సురేఖకు ఫోన్ చేశారు. వెంటనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు. దీంతో గురువారం కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. సమంత, నాగ చైతన్య విడాకుల విషయం ఇంత రాద్దాంతానికి గురి చేస్తుందని తాను అనుకోలేదన్నారు.
ఇప్పటికే సమంత రుత్ ప్రభుకు తాను ట్విట్టర్ ఎక్స్ వేదిక ద్వారా సారీ చెప్పానని స్పష్టం చేశారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మాత్రం వదిలివేసే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఆయనపై చేసిన ఆరోపణలు, విమర్శలకు తాను కట్టుబడి ఉన్నానని, ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.