కొండా సురేఖ నిష్క్రమిస్తే బెటర్ – ఆర్ఎస్పీ
బాధ్యత కలిగిన మంత్రి మాట్లాడేది ఇలాగేనా
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీరియస్ అయ్యారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై నిప్పులు చెరిగారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. ఒక బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉన్నానన్న సోయి లేకుండా ఎలా పడితే అలా మాట్లాడటం దారుణమన్నారు.
మీకు ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మీకు అలా మాట్లాడమని చెప్పిన వారెవరో , వారి పేరు బయట పెట్టాలని అన్నారు.
ఫేక్ అకౌంట్ల ద్వారా తూతూ మంత్రంగా సంజాయిషీ ఇవ్వడం భావ్యం కాదన్నారు. మీరు నిన్న మాట్లాడిన భాష, మీరు గతంలో మరొక వ్యక్తితో జుగుప్సాకరమైన భాషలో సంభాషించుకున్న విధానం సోషల్ మీడియా ద్వారా తెలుగు రాష్ట్రాలకు దావానలంగా పాకుతున్నది. ఒక భాద్యతాయుతమైన మంత్రిగా ఉండి మీరు మాట్లాడిన బూతులు ఒక తరం భాషను, వాళ్ల ఆలోచనలను కరప్ట్ చేసే ప్రమాదమున్నదని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ఎస్పీ.
మీ లాంటి రాజకీయ నాయకులు మాట్లాడిన మాటల వెనక ఆలోచనలు, వాటి వెనక అనుభవాలు, వాటి మూలాలు, వాటి వెనక ఎన్నో జీవితాల మౌన రోదనలు, చీకట్లో నిస్సహాయ ప్రేక్షక పాత్ర వహించిన ఓరుగల్లు నగరం లోని కొన్ని చిరునామాలు , ఈ తరానికి తెలిస్తే వాళ్లు తట్టుకోలేరు. ఇంతకు మించి నేను ఇక్కడ రాయలేనని అని పేర్కొన్నారు.
మీరు దేవాదాయశాఖ మంత్రిగా రేపటి నుండి ఆఫీసులో సాటి మహిళలతో ఏ విధంగా పని చేస్తారని ప్రశ్నించారు. వాళ్లు తమరి గురించి ఏం ఆలోచిస్తారో తమరెప్పుడైనా ఆలోచించారా అని పేర్కొన్నారు. తెలంగాణ గ్రామ దేవతలందరూ మీరు వారి దేవాలయాలకు మంత్రిగా ఉండొద్దని వేడుకుంటున్నారు.
ఇక దయచేసి నిష్క్రమించండిని కోరారు.