జర్నలిస్ట్ పై దాడి అప్రజాస్వామికం – రాకేశ్ రెడ్డి
రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ రాష్ట్రంలో ప్రశ్నించడమే పాపంగా మారిందని అన్నారు. ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారిని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని, రక్షించాల్సిన పోలీసులు చోద్యం చూస్తున్నారని వాపోయారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని, ఒక రకంగా చెప్పాలంటే అత్యంత ప్రమాదంలో ఉందని అన్నారు. బాధ్యత కలిగిన జర్నలిస్ట్ తన వృత్తి ధర్మాన్ని నిర్వహించడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. గురువారం జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పై దాడి చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఏనుగుల రాకేశ్ రెడ్డి. దీనిని తాను , తమ పార్టీ పూర్తిగా ఖండిస్తోందని పేర్కొన్నారు.
మొన్నటికి మొన్న ప్రతిపక్ష నేతలపై దాడి చేశారని, నిన్న ప్రతిపక్ష కార్యకర్తలను చంపుతాం అని బెదిరింపులు చేశారని ఇవాళ బాజాప్తాగా జర్నలిస్ట్ పై దాడి జరగడం చూస్తుంటే మనం తెలంగాణలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందన్నారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.
ఇంత జరుగుతున్నా హోమ్ మినిస్టర్ గా ఉన్న చీఫ్ మినిస్టర్ సప్పుడు చేయక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే చరిత్ర నిర్మాతలని గుర్తు పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. ప్రజాస్వామికవాదులు, జర్నలిస్టులు ఈ దాడిని ఖండించాలని కోరారు.