NEWSTELANGANA

నోరు జారిన వాళ్ల‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలి

Share it with your family & friends

కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ – కేంద్ర మంతి గంగాపురం కిష‌న్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాజాగా సినీ రంగానికి చెందిన అక్కినేని నాగార్జున‌, నాగ చైత‌న్య‌, స‌మంత రుత్ ప్ర‌భుకు సంబంధించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌.

దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. దీనిపై స్పందిస్తూ ఇలాంటి జుగుస్సాక‌ర‌మైన భాష మాట్లాడ‌టం మంచి ప‌ద్దతి కాద‌న్నారు. ఇలాంటి నీచ‌మైన భాష‌, ఇత‌రుల ప‌ట్ల చుల‌క‌న భావంతో కూడిన మాట‌లు గ‌త 10 ఏళ్లుగా కొన‌సాగుతూ వ‌చ్చాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఆయ‌న ప‌రోక్షంగా క‌ల్వ‌కుంట్ల కుటుంబం గురించి ప్ర‌స్తావించారు. కెసిఆర్ తెలంగాణ సమాజంలో విష ఫలాన్ని నాటారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సురేఖ ఇలా మాట్లాడటం స‌బ‌బు కాద‌న్నారు.

గత 10-15 ఏళ్లుగా తెలంగాణలోని రాజకీయ నాయకులు తమ ప్రసంగాలు, విలేకరుల సమావేశాలు, సోషల్ మీడియాలో మహిళలను, సమాజాన్ని అవమానించేలా మాట్లాడుతున్నార‌ని ఇది స‌మాజానికి మంచిది కాద‌న్నారు.

ఇలాంటి రాజకీయ నాయకులను బహిష్కరించి బ్లాక్‌లిస్టులో పెట్టకపోతే తెలంగాణతో పాటు దేశంలో కూడా ఇది విస్తరిస్తుందన్నారు.