ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు – ఈవో
స్పష్టం చేసిన జె. శ్యామలరావు తిరుమల
తిరుమల – శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి ఈవో జె. శ్యామలరావు చెప్పారు. భక్తుల సౌకర్యార్థం టిటిడిలోని అన్ని విభాగాల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం ఈవో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అత్యంత వైభవంగా జరుగనున్నాయని తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుందన్నారు. గరుడ వాహన సేవ సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు.
ఈ విశేష ఉత్సవాలను తిలకించేందుకు విచ్చేసే భక్త కోటికి టీటీడీ అనేక ఏర్పాట్లను చేసిందని స్పష్టం చేశారు. ఈవో.అక్టోబరు 04న శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
అదే విధంగా అక్టోబర్ 5వ తేదీ ముఖ్యమంత్రి తిరుమల పాంచజన్యం విశ్రాంతి భవనం వెనుక వైపున రూ.13.45 కోట్లతో నూతనంగా అత్యాధునిక పరికరాలతో నిర్మించిన వకుళమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభిస్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయంలో పలు ఆర్జితసేవలు రద్దు చేశారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోజుకు 7 లక్షల లడ్డూలను నిల్వ ఉంచామన్నారు ఈవో.
భక్తుల సౌకర్యార్థం లడ్డూ కౌంటర్లను 2023లో 54 ఉండగా 2024లో 65, అంటే 11 అదనంగా ఏర్పాటు చేశామని , వయో వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు తదితర ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామన్నారు.
బ్రేక్ దర్శనం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశామని, గరుడ సేవ రోజు అక్టోబరు 8న బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపారు జె. శ్యామల రావు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 1.32 లక్షల రూ.300/` దర్శన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచామన్నారు. తిరుపతిలో ప్రతి రోజూ సర్వదర్శనం టోకెన్లు 24 వేలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
అంగప్రదక్షిణ టోకెన్ల రద్దు చేశామని, శ్రీవారి ఆలయం, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో ఉద్యానవన, విద్యుత్ విభాగాల ఆధ్వర్యంలో శోభాయమానంగా అలంకరణలు చేపడుతున్నామని తెలిపారు ఈవో.
భద్రత విషయానికి వస్తే దాదాపు 1250 మంది టిటిడి నిఘా, భద్రతా సిబ్బందితో పాటు పోలీసు సిబ్బంది దాదాపు 3900 మంది ఉన్నారని పేర్కొన్నారు. 2024లో 151 మందితో పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టామన్నారు. గరుడ సేవకు ప్రత్యేకంగా 1200 మంది పోలీసులతో అదనపు భద్రత కల్పించనున్నట్లు తెలిపారు.
ఆలయ మాడ వీధులు, ఇతర ప్రాంతాల్లో 2,775 సిసి కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పర్యవేక్షిస్తామన్నారు జె. శ్యామలరావు. పిఏసి – 4లోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో వీడియోవాల్ ద్వారా పలు ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షిస్తాం.
సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో భద్రతా సిబ్బందితోపాటు వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది భక్తుల నుండి ఎప్పటికప్పుడు ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
హోంగార్డులు, ఎన్సిసి విద్యార్థులు, ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక పరికరాలతో కూడిన సిబ్బంది, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశామన్నారు. భక్తులు భద్రతాప రమైన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు టోల్‌ఫ్రీ నంబరు 155257కు ఫిర్యాదు చేయాలని సూచించారు ఈవో. శ్రీవారి సేవా సదన్ వద్ద 4 అదనపు లగేజి సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.
ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి లక్షలాది భక్తులు వాహన సేవలు వీక్షించేందుకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో గ్యాలరీలు సుందరంగా తీర్చిదిద్దామన్నారు. తిరుమలలో ఎల్ఈడి స్క్రీన్లు గత సంవత్సరం 3 రోజుల పాటు 28 స్క్రీన్లు ఏర్పాటు చేయగా, 2024లో 9 రోజుల పాటు 28 స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు ఈవో.
-గరుడసేవ నాడు వాహన సేవను తిలకించేందుకు మాడ వీధులు, భక్తుల రద్దీ ఉన్న మ్యూజియం, వరాహస్వామి విశ్రాంతి గృహం, అన్నదానం కాంప్లెక్స్, రాంభగీచా విశ్రాంతి గృహం, ఫిల్టర్ హౌస్ ఇతర ప్రాంతాల్లో కలిపి 28 పెద్ద డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
తిరుమలలోని పలు కూడళ్లలో భక్తులకు అందుబాటులో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు జె. శ్యామల రావు.
భక్తులను ఆకట్టుకునేలా శ్రీవారి ఆలయం, జిఎన్సి ప్రాంతాల్లో దేవతామూర్తుల ప్రతిరూపాలతో విద్యుద్దీపాలంకరణలు. తిరుమలలోని అన్ని కూడళ్లలో ప్రత్యేకంగా విద్యుత్ అలంకరణలు చేపట్టడం జరిగిందన్నారు.
రేడియో బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా తిరుమల, నడకమార్గాల్లో తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో భక్తులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందజేస్తున్నట్లు తెలిపారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో 9 వేల వాహనాలకు సరిపడా పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు.
తిరుమలలో బాలాజినగర్, కౌస్తుభం ఎదురుగా, రాంభగీచా బస్టాండు, ముళ్లగుంత వద్ద, తిరుపతిలోని అలిపిరి పాత చెక్ పాయింట్ , శ్రీవారి మెట్టు వద్ద 6 వేల వాహనాలకు సరిపడా పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు జె. శ్యామల రావు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అవసరమైన వసతి ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. తిరుమలలో సామాన్య భక్తుల కోసం 6,282 గదులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సాధారణ రోజుల్లో 1,580 గదులు ఆన్లైన్లో భక్తులకు కేటాయిస్తారని తెలిపారు ఈవో. బ్రహ్మోత్సవాల్లో వీటిని 50 శాతానికి తగ్గించడం జరిగిందన్నారు. విఐపి ఏరియాలో 1,353 గదులు అందుబాటులో ఉన్నాయని, తిరుమలలోని గదుల్లో దాదాపు 40 వేల మంది భక్తులు బస చేసే అవకాశం ఉందన్నారు ఈవో.
పిఏసి -1, 2, 3, 4లలో కలిపి 28 హాళ్లలో దాదాపు 6700 లాకర్లు ఉన్నాయని, దాదాపు 20 వేల మంది భక్తులు బస చేయవచ్చని వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమలలో వసతి పొందలేని భక్తులు తిరుపతిలో వసతి పొందాల్సిందిగా సూచించారు . బ్రహ్మోత్సవాల రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజి దాతలకు మాత్రమే గదులు కేటాయించడం జరుగుతుందన్నారు.
కాగా అక్టోబరు 8న గరుడసేవ సందర్భంగా అక్టోబరు 7, 8వ తేదీలలో కాటేజి దాతలకు కూడా ఎలాంటి గదుల కేటాయింపు ఉండదని స్పష్టం చేశారు జె. శ్యామల రావు. అక్టోబరు 3 నుండి 12వ తేదీ వరకు ఎలాంటి సిఫార్సు లేఖలపై గదులు కేటాయించడం లేదన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు జె. శ్యామల రావు.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అదనంగా 600 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించామన్నారు. పర్యవేక్షణ సిబ్బంది: గత సంవత్సరం 8 మంది, ఈ సంవత్సరం 49 మందిని (డిఎం & హెచ్ఒ నుండి 20, పిఆర్ శాఖ నుండి 14, మునిసిపల్ యాజమాన్యం నుండి 15) ఏర్పాటు చేశామన్నారు.
వీరు పారిశుద్ధ్య నిర్వహణతో పాటు, కాటేజీలు, యాత్రికుల వసతి సముదాయాల వద్ద విధులు నిర్వహిస్తారని తెలిపారు ఈవో. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, కంపార్ట్మెంట్లు, క్యూలైన్లు, అన్నప్రసాదం, పాలు, అల్పాహారం వితరణకు ఏర్పాట్లు చేశామన్నారు.
పులిహోర 2023లో 1.75 లక్షలు, 2024లో రెండు లక్షలు అందిస్తామన్నారు. కాఫీ 2023లో 40 వేలు అందించగా 2024లో 59 వేలు, పాలు 2023లో ఒక లక్ష అందించగా 2024లో 1.95 లక్షలు అందజేస్తామన్నారు. ఉప్మా 2023లో 2 లక్షలు అందించగా 2024లో 2.5 లక్షలు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ఫుడ్ కౌంటర్ల ద్వారా అన్నప్రసాదాలు అందిస్తామన్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాల పంపిణీ జరుగుతుందన్నారు. కూరగాయల దాతల సహకారంతో రుచి కరమైన అన్నప్రసాదాలు అందిస్తామన్నారు ఈవో. ప్రతిరోజూ లక్ష మందికి పాలు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
భక్తులకు వైద్య సేవలు అందించేందుకు తిరుమలలోని అశ్వని ఆసుపత్రి, వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని వైద్య కేంద్రాలు, 6 డిస్పెన్సరీల్లో అదనపు సిబ్బంది ఏర్పాటు. తగినన్ని మందులు సిద్ధంగా ఉంచుకున్నామని తెలిపారు. తిరుమలలోని ప్రధాన కూడళ్లలో 14 ప్రథమచికిత్స కేంద్రాలు, ఒక మొబైల్ క్లినిక్. ఆలయ నాలుగు మాడ వీధులతో పాటు అన్ని ముఖ్య కూడళ్లలో 12 అంబులెన్సులు. 45 మంది వైద్యులు, 60 మంది పారామెడికల్ సిబ్బంది భక్తులకు సేవలందిస్తారని తెలిపారు ఈవో.
-స్విమ్స్, బర్డ్, రుయా ఆసుపత్రుల నుండి వైద్యులు అందుబాటులో ఉంటారని, భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో హోమియోపతి, ఆయుర్వేద వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు . గుండె సంబంధిత చికిత్సల కోసం తిరుమలలోని అపోలో కార్డియాక్ సెంటర్లో తగినంత మంది వైద్యులు అందుబాటులో ఉంటారని వెల్లడించారు జె శ్యామల రావు. అవసరమైన మందులను సిద్ధంగా ఉంచు కోవడం జరిగిందన్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గాల వద్ద స్విమ్స్ వైద్యులతో కార్డియాక్ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్వామి వారి భక్తులకు తెలియ జేసేందుకు మీడియాసెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు జె. శ్యామల రావు. భక్తుల సౌకర్యార్థం గత ఏడాది 5 కౌంటర్లు ఉండగా, ఈ సంవత్సరం 12, అంటే 7 అదనంగా (తిరుమలలో 5, తిరుపతిలో 2) ఏర్పాటు చేశామన్నారు.
ఇందులో తిరుమలలోని జిఎన్సి, సిఆర్వో, ప్రధాన కల్యాణకట్ట, భజన మందిరం, ఎటిసి సమాచార కేంద్రాలతో పాటు ఈ ఏడాది అదనంగా పిఏసి`2, విజివో కార్యాలయం సమీపంలో, రాంభగీచ అతిథి గృహం వద్ద, మ్యూజియం వద్ద, ఆర్టిసి బస్టాండ్ ఎదురుగా టీటీడీకి సంబంధించిన సమాచారాన్ని కరపత్రాలలో ముద్రించి భక్తులకు అందుబాటులో ఉంచామన్నారు.
శ్రీవారి సేవ కు సంబంధించి 2023లో 3 వేల మంది సేవలందించగా, 2024లో 4 వేల మంది, అదనంగా 1000 మంది శ్రీవారి సేవకులు తిరుమలలోని అన్ని విభాగాల్లో భక్తులకు సేవలందిస్తారని తెలిపారు. దూరదర్శన్, ఆకాశవాణితో పాటు ఇతర ప్రసార మాధ్యమాలలో బ్రహ్మోత్సవాల ప్రసారం జరుగుతుందన్నారు.
టిటిడి కాల్‌సెంటర్ ద్వారా శ్రీవారి బ్రహ్మోత్సవాల సమస్త సమాచారాన్ని భక్తులకు అందించే ఏర్పాటు. కాల్ సెంటర్ నంబరు 155257 కు చేయాలని సూచించారు. అంతే కాకుండా భక్తులు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు వీలుగా ఈ`మెయిల్ helpdesk.ttd@tirumala.orgను అందుబాటులో ఉంచామన్నారు.
గరుడసేవ రోజున 24 గంటల పాటు ఘాట్ రోడ్లను తెరిచి ఉంచడం జరుగుతుందన్నారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో రోజుకు దాదాపు 2 వేల ట్రిప్పుల ద్వారా దాదాపు 2 లక్షల మందికి రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు ఈవో. తిరుమలలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి భక్తులను చేర వేసేందుకు 24 గంటల పాటు ఉచిత బస్సుల ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
-ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు, ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకున్నామని, ఇందులోభాగంగా సాదారణ రోజుల్లో 8 ప్రాంతాల్లో, గరుడ సేవనాడు 12 ప్రాంతాలలో క్రేన్లు, ఆటోమొబైల్ క్లినిక్ వాహనాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు జె. శ్యామల రావు.
హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అస్సాం మొదలైన 21 రాష్ట్రాల నుండి వచ్చే కళాబృందాలతో వాహనసేవల్లో ప్రదర్శనలు ఉంటాయన్నారు.
2023లో 12 రాష్ట్రాల నుండి కళా బృందాలు పాల్గొనగా, 2024లో 21 రాష్ట్రాలు (19 రాష్ట్రాలు ఇప్పటికే రూఢీ అయ్యాయి ) మొత్తం 160 బృందాలు రానున్నాయని తెలిపారు ఈవో. తిరుమలలో ఆస్థాన మండపం, నాద నీరాజనం వేదికతోపాటు తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలో ఆధ్యాత్మిక, ధార్మిక ఉపన్యాసాలు, సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు సేవలందించేందుకు జిల్లా యంత్రాంగం తమవంతు సహకారం అందిస్తోందన్నారు.
గరుడ సేవకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 8న గరుడ సేవ రోజున విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులకు సంతృప్తికరంగా దర్శన ఏర్పాట్లు చేశామన్నారు ఈవో.
-దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉంటారు. గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవిందని లయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి అనుమతిస్తామన్నారు.
గరుడ సేవ రోజున 24 గంటల పాటు ఘాట్ రోడ్లు, శ్రీవారి మెట్టు మార్గం తెరిచి ఉంచడం జరుగుతుందన్నారు. గరుడ వాహనాన్ని సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభించి భక్తులందరూ దర్శించుకునేలా రాత్రి 11 గంటల వరకైనా నెమ్మదిగా ముందుకు తీసుకెళతామన్నారు.
బయట వేచి ఉండే భక్తులు తమవంతు వచ్చే వరకు సంయమనంతో వేచి ఉండి భద్రతా విభాగం నిబంధనలు పాటించాలని, అందరికీ గరుడసేవ దర్శనం కల్పిస్తామన్నారు ఈవో. భక్తుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల ఘాట్ రోడ్లలో ద్వి చక్రవాహనాల రాక పోకలను రద్దు చేశామన్నారు.
ఇక తిరుపతిలోని అలిపిరి పాత చెక్ పాయింట్ వద్ద రెండు వేల టూ వీలర్లు, వినాయక్‌నగర్ క్వార్టర్స్, నెహ్రూ మున్సిసల్ గ్రౌండ్, భారతీయ విద్యాభవన్, దేవలోక్ల వద్ద ఉన్న గ్రౌండ్లలో 4 వీలర్లు, అదనంగా శ్రీవారి మెట్టు వద్ద కూడా పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తిరుపతిలోని పార్కింగ్ ప్రదేశాల నుంచి తిరుమలకు వెళ్లేలా ఆర్టిసి బస్సులను ఏర్పాటు చేశామన్నారు.
ఆర్టిసి బస్సుల్లో దాదాపు 3 వేల రౌండ్ ట్రిప్పుల ద్వారా దాదాపు 3 లక్షల మందిని తరలించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 7 నుండి రాత్రి 1 గంట వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు అందిస్తామన్నారు. 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తామన్నారు. భక్తుల కోసం పులిహోర, టమోటా బాత్, బిసిబెళా బాత్ తదితర అన్న ప్రసాదాల ప్యాకెట్లు అందిస్తామని తెలిపారు. వాహనాలపై చిల్లర నాణేలు విసరవద్దని మరొకసారి భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు ఈవో.
శ్రీవారి పుష్కరిణి స్నానం మోక్షదాయకం. దీని మహత్యం రోజంతా ఉంటుంది. కావున ఒకేసారి అందరూ పుష్కరిణి స్నానానికి ప్రయత్నించవద్దని మనవి. సంయమనంతో వ్యవహరించి స్నానమాచరించ వలసిందిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.
భక్తులు పుష్కరిణిలోకి ప్రవేశించేందుకు, తిరిగి వెలుపలికి వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశామన్నారు. భక్తుల భద్రత కోసం గజ ఈతగాళ్లతో పాటు, ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది, బోట్లను అందుబాటులో ఉంచామన్నారు.
ఈ సమావేశంలో ఏఈవో వెంకయ్య చౌదరి, జేఈవోలు గౌతమి, వీర బ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, సి శ్రీ సత్యనారాయణ, ఆలయ డిప్యూటీవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.