రైతులకు దిక్కేది బోనస్ ఊసేదీ..?
బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి
వరంగల్ జిల్లా – కాంగ్రెస్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి. శుక్రవారం పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి ధయకర్ రావు అధ్యక్షతన నిర్వహించిన మహా రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. సన్న బియ్యానికి రూ. 500 బోనస్ ఇస్తున్నట్లే దొడ్డు బియ్యానికి కూడా రూ. 500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు దిక్కు లేకుండా పోయిందని, భరోసా ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని గద్దెను ఎక్కాక వాటిని విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.
వానాకాలం సీజన్ ఫూర్తయినప్పటికీ ఇప్పటి వరకు రైతు భరోసా సంగతి తేల్చటం లేదని అన్నారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా పేరిట ఎకరాకు రూ. 7500 ఇస్తామంటూ స్వయంగా పీసీసీ అధ్యక్షుడి హోదాలో మీరే మాట్లాడారని గుర్తు చేశారు.
కానీ గత సీజన్ లో రైతులకు రైతుబంధు పైసలు మాత్రమే వేశారు. ఈ సీజన్ కు సంబంధించి ఇప్పటి వరకు అసలు రైతు భరోసా సంగతే తేల్చటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు నాట్లు వేసే నాడు వేయాల్సిన పెట్టుబడి సాయాన్ని పంట చేతికొచ్చే వరకు కూడా ఇవ్వక పోవటమంటే రైతు పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందన్నారు. ఇంకా 20 లక్షల మంది రైతులకు రుణ మాఫీ కాలేదని వాపోయారు ఏనుగుల రాకేశ్ రెడ్డి. రైతులకు న్యాయం జరిగేంత వరకు తాము పోరాటం చేస్తూనే ఉంటామని ప్రకటించారు.