DEVOTIONAL

పెద్ద శేష వాహ‌నంపై వైకుంఠ నాథుడు

Share it with your family & friends

శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప

తిరుమ‌ల – కోట్లాది మంది భ‌క్తుల కోరిక‌లు తీర్చే కొంగు బంగారంగా భావించే తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్త జ‌న‌సందోహంతో కోలాహాలంగా మారింది. గోవిందా గోవిందా శ్రీ‌నివాసా గోవిందా, ఆప‌ద మొక్కుల వాడా గోవిందా అంటూ భ‌క్తులు స్మ‌రించుకుంటూ ముందుకు సాగుతున్నారు.

తిరుమ‌ల శ్రీవారి సాలకట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌లో భాగంగా పెద్ద‌శేష వాహనంపై పరమ పద వైకుంఠ నాథుడు
శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారు ఏడు తలల స్వర్ణ శేషవాహనంపై (పెద్ద శేషవాహనం) పరమపద వైకుంఠనాధుడు అలంకారంలో తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు.

ఆది శేషుడు తన పడగ నీడలో స్వామి వారిని సేవిస్తూ పాన్పుగా దాస్య భక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు.

ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.