ANDHRA PRADESHNEWS

కాంగ్రెస్ తోనే ప్ర‌త్యేక హోదా సాధ్యం

Share it with your family & friends

ఏపీ స‌ర్కార్ పై వైఎస్ ష‌ర్మిలా రెడ్డి ఫైర్
అమ‌రావ‌తి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల నిప్పులు చెరిగారు. ఆమె త‌న సోద‌రుడు, ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని టార్గెట్ చేశారు. గ‌తంలో ఏలిన చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా చేశార‌ని ఆరోపించారు. ఆయ‌న‌కు తీసిపోనంటూ జ‌గ‌న్ రెడ్డి పోటీ ప‌డి అప్పులు తీసుకు వ‌చ్చార‌ని దీని వ‌ల్ల రాష్ట్రానికి భారం త‌ప్ప మిగిలింది ఏమీ లేద‌న్నారు.

ఇన్ని వేల కోట్లు తీసుకొచ్చిన ఏపీ స‌ర్కార్ ఎక్క‌డ , ఎవ‌రి కోసం ఖ‌ర్చు చేసిందో చెప్పాల‌ని నిల‌దీశారు. ఆమె త‌న స్వంత సోద‌రుడిని ల‌క్ష్యంగా చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా అన‌కాప‌ల్లిలో జ‌రిగిన పార్టీ స‌మావేశంలో ప్ర‌సంగించారు. రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న సాగుతోంద‌ని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ వైఎస్సార్ స‌ర్కార్ కాద‌న్నారు.

త‌న తండ్రి ప్ర‌జ‌ల కోసం ప‌ని చేశాడ‌ని చెప్పారు . ఆయ‌న ఆశ‌యాలు ఆచ‌ర‌ణ‌లోకి రావాలంటే అది కేవ‌లం కాంగ్రెస్ పార్టీ వ‌ల్ల‌నే సాధ్య‌మ‌వుతుంద‌ని అన్నారు వైఎస్ ష‌ర్మిల‌. ప్ర‌తి గ‌డ‌ప‌కు కాంగ్రెస్ పార్టీ వెళ్లాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వం చేస్తున్న మోసాల‌ను ఎండ‌గ‌ట్టాల‌ని, ఎక్క‌డిక‌క్క‌డ నిల‌దీయాల‌ని పిలుపునిచ్చారు.