కట్టేటోడు కాదు కూల్చేటోడు ఈ సీఎం – కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర సర్కార్ పై తీవ్ర ఆగ్రహం
రంగారెడ్డి జిల్లా – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. పేదలు, సామాన్యులకు ఇళ్లు కట్టిస్తాడని అనుకుంటే ఉన్న కట్టుకున్న ఇళ్లను కూల్చేయడం స్టార్ట్ చేశాడని మండిపడ్డారు. ఇదేనా ప్రజా పాలన అని ప్రశ్నించారు.
పది నెలలైనా రైతు రుణ మాఫీ కాలేదన్నారు. ఇంకా రాష్ట్రంలో 20 లక్షల మంది రైతులకు అందలేదని దీనిపై రేవంత్ రెడ్డి బేషరతుగా సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తొలి రోజే సంతకం చేస్తానని చెప్పాడని, కానీ దాని ఊసే ఎత్తడం లేదన్నారు.
ఎక్కడైనా లంకె బిందెలు ఉంటాయని దొంగలు వెతుకుతారని, మరి సీఎం లంకె బిందెలు ఉన్నాయని వచ్చానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు . కనిపించే దేవుళ్లను చూపించి ప్రజలను మోసం చేయడం ప్రారంభించాడని మండిపడ్డారు కేటీఆర్. రైతు బంధు ఊసే లేదు..రైతు భరోసా ఎక్కడుందో చెప్పాలని అన్నారు. ప్రతి వర్గాన్నీ మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డిదేనని పేర్కొన్నారు.
తమ హయాంలో బతుకమ్మ పండుగ సందర్బంగా చీరలు ఇచ్చామని, ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. రైతులకు ఇచ్చేందుకు డబ్బులు లేవంటున్నాడని, మరి మూసీ అభివృద్దికి లక్షా 50 వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. మూసీ బ్యూటిఫికేషన్ కోసం కాదని లూటీఫికేషన్ కోసమేనని సంచలన ఆరోపణలు చేశారు.