గొడుగుల ఊరేగింపులో భక్తులు కానుకలు ఇవ్వొద్దు
స్పష్టం చేసిన టీటీడీ ఈవో జె. శ్యామల రావు
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భారీ ఎత్తున శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. తొలి రోజు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరితో కలిసి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఇదిలా ఉండగా ఉత్సవాలను పురస్కరించుకుని భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది టీటీడీ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ నాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపు రానుంది. ఈ సందర్బంగా భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని టీటీడీ ఈవో జె. శ్యామల రావు విన్నవించారు.
భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని, కానుకలతో టీటీడీకి ఎలాంటి సంబంధమూ లేదని తెలియజేస్తోంది.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామి వారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ గొడుగులు అక్టోబరు 7న తిరుమలకు చేరుకుంటాయి.