కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్ప
చిన్నశేష వాహనంపై ఊరేగిన శ్రీవారు
తిరుమల – శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి వారు ఐదు తలల చిన్నశేష వాహనంపై మురళీ కృష్ణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.
చిన్నశేషుడిని వాసుకి (నాగ లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం భగవంతుడు శేషి, ప్రపంచం శేష భూతం. శేషవాహనం ఈ శేషి భావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయస్సుతో పాటు కుండలినీ యోగ సిద్ధి ఫలం లభిస్తుందని ప్రశస్తి.
రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామి వారు భక్తులను కటాక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఈవో జె.శ్యామలరావు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.