హర్యానాలో హస్తం హవా – ఎగ్జిట్ పోల్స్
పని చేసిన రాహుల్ గాంధీ ప్రభావం
హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ కొలువు తీరిన హర్యానాలో హస్తం తన పాగా వేయబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశాయి. రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. ఏది ఏమైనా ఈసారి కాషాయం తన అధికారాన్ని కోల్పోవడం ఖాయమని పేర్కొన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కీలక నేతలు హర్యానాలో పర్యటించినా ఈసారి వర్కవుట్ కాలేదని తేలి పోయింది.
ఏది ఏమైనా కాంగ్రెస్ తన జోరును కొనసాగిస్తోంది. భారీ ఎత్తున సీట్లను కైవసం చేసుకోనుందని తేల్చాయి. అధికార పీఠం హస్తానికే దక్క బోతోందని కుండ బద్దలు కొట్టాయి. ఇక మాట్రిజ్ సర్వే ప్రకారం హర్యానాలో కాంగ్రెస్‌కు 55-62 సీట్లు రానున్నాయని తెలిపింది.
ఇక 3-6 సీట్లకే పరిమితం కానున్నది ఐఎన్‌ఎల్‌డీ. సీఎన్‌ఎన్ సర్వే కూడా బీజేపీ తన పవర్ ను కోల్పోనుందని తెలిపింది. కాంగ్రెస్‌కు 59, బీజేపీకి 21 సీట్లు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక ప్రముఖ పత్రిక దైనిక్ భాస్కర్ అయితే ఏకంగా ఇక బీజేపీ ఇంటి బాట పట్టాల్సిందేనని స్పష్టం చేసింది.
కాంగ్రెస్‌కు 44-54, బీజేపీకి 15-29 సీట్లు రావొచ్చని అంచనా వేసింది. ఇదిలా ఉండగా హర్యానా రాష్ట్రంలో మొత్తం 90 సీట్లు ఉన్నాయి. 61 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. అక్టోబర్ 8న హర్యానాతో పాటు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు వెల్లడించనుంది కేంద్ర ఎన్నికల సంఘం.