DEVOTIONAL

స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

Share it with your family & friends

హంస వాహ‌నంపై శ్రీ వేంక‌టేశ్వ‌రుడు

తిరుమ‌ల – శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో రెండ‌వ‌ రోజు శనివారం రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారు హంస వాహనంపై వీణ ధ‌రించి స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు స్వామివారిని వాహ‌న‌సేవ‌లో ద‌ర్శించుకున్నారు.

హంస వాహన సేవలో శ్రీ మలయప్ప స్వామి వారు జ్ఞాన మూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచిక.

అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్ర‌హ్మ‌ప‌ద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.

వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఈవో జె.శ్యామల రావు, అదనపు ఈవ సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవోలు గౌతమి, వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీధర్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.