ఆకట్టుకున్న ధార్మిక..సంగీత కార్యక్రమాలు
అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు
తిరుమల – శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన శనివారం తిరుమలలోని నాద నీరాజనం, ఆస్థాన మండపంలో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
తిరుమల నాద నీరాజనం వేదికపై ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాలకు చెందిన మునిరత్నం, కృష్ణమూర్తి, కృష్ణారావు బృందం మంగళ ధ్వని, ఉదయం 5:30 నుండి 6:30 గంటల వరకు రాజమండ్రికి చెందిన రామచంద్ర ఘనాపాటి “వేదోపదేశం- లోక కళ్యాణ ప్రదం” అనే అంశంపై ఉపన్యసించారు. తర్వాత సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి బృందం అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు.
ఆస్థాన మండపంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు హైదరాబాద్ కు చెందిన సీతారామాంజునమ్మ ‘విష్ణు సహస్రనామ పారాయణం’ ఉదయం 10 నుండి 11:30 గంటల వరకు బెంగళూరుకు చెందిన రేష్మ మధుసూదన్ బృందం భక్తి సంగీతం, ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు హైదరాబాదుకు చెందిన శ్రీ జగన్మోహన ఆచార్యులు ‘ ఆళ్వార్ ప్రబంధాలలో భగవద్గీత’ అనే అంశంపై ఉపన్యసించారు.
అనంతరం సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు తిరుపతికి చెందిన సుశీల బృందం అన్నమాచార్య సంకీర్తనలను సుమధురంగా ఆలపించారు. సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల వరకు తిరుపతికి చెందిన వరలక్ష్మి బృందం హరికథ గానం చేశారు.