తిరుమలలో ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు
అంగరంగ వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు
తిరుమల – శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన ఆదివారం ఉదయం సింహ వాహన సేవలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. ఆంధ్ర రాష్ట్రంతో పాటు, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్టాలకు చెందిన 20 కళా బృందాలలో 530 మంది కళాకారులు వారి వారి కళా రూపాలతో శ్రీవారిని సేవించుకున్నారు.
చెన్నైకి చెందిన పద్మప్రియ, తిరుపతికి చెందిన హేమమాలిని బృందాలు ప్రదర్శించిన భరత నాట్యం, వివిధ వేషధారణలు, తమిళనాడుకు చెందిన సురేష్ వైష్ణవ సుగుమాన్ బృందాలు ప్రదర్శించిన మోహిని అట్టం విశేషంగా ఆకట్టుకున్నది. బెంగళూరుకు చెందిన దివ్యశ్రీ బృందం ప్రదర్శించిన నరసింహ నమనం కళా ప్రదర్శన భాగవతంలోని నరసింహావతారాన్ని కనుల ముందు సాక్షాత్కరింపచేసినది.
రాజమండ్రికి చెందిన ఉమారాణి బృందం ప్రదర్శించిన మయూరి నాగిని నృత్యం కనువిందు చేసింది. పంజాబ్ జానపద కళారూపమైన జూమర్ను పుష్కల బృందం ప్రదర్శించిన తీరు అబ్బుర పరిచింది. చెన్నైకి చెందిన ఉమామహేశ్వరి బృందం కూచిపూడి నృత్యం విశేషంగా ఆకట్టుకున్నది. తిరుపతికి చెందిన డా. వంశీధర్ చెంచులక్ష్మి బృందం నరసింహమూర్తి, ప్రహ్లాదుల రూపాలతో అలరించారు.
మధ్యప్రదేశ్ కు చెందిన కె.ఎస్.వర్మ చెలియ అనే జానపద కళారూపం ఆకట్టుకుంది. తమిళనాడుకు చెందిన మీనాక్షి బృందం కథక్ నృత్యంతో అలరించారు. అనకాపల్లికి చెందిన భాగ్యలక్ష్మి, శ్రీకాకుళంకు చెందిన కృష్ణవేణి, తిరుపతికి చెందిన డా. రేణుకాదేవి, గూడూరుకు చెందిన చంద్రకళ, తిరుమలకు చెందిన శ్రీనివాసులు, విశాఖపట్నంకు చెందిన తాతయ్యలు కోలాట నృత్యాలతో భక్తులను తన్మయత్వం చెందారు.