బాబూ స్టీల్ ప్లాంట్ పై మోడీని నిలదీయండి
నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి
విజయవాడ – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. సీఎంగా కొలువు తీరాక మీరు, మీతో పాటు పవన్ కళ్యాణ్ పలుమార్లు ఢిల్లీకి వెళ్లి వస్తున్నారే తప్పా ఏపీకి , రాష్ట్ర అభివృద్దికి, ప్రజలకు చేసిన మేలు ఒక్కటైనా లేదన్నారు. ఆదివారం వైఎస్ షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు.
విశాఖ స్టీల్ పరిరక్షణపై మీరిచ్చిన హామీని మరోసారి గుర్తు చేస్తున్నామని అన్నారు. ప్రతిపక్ష నేతగా 2021 లో అనాడు మీరు సంతకం చేసి ఇచ్చిన లేఖను తిరిగి మీకు జ్ఞాపకం చేసేందుకని పంపిస్తున్నామని చెప్పారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ప్రైవేటీకరణ అడ్డుకుంటానని, ప్లాంట్ పూర్వ వైభవానికి కృషి చేస్తామని, అవసరమైతే రాజీనామాలు కూడా చేస్తామని, రాశారో లేదో చూసుకోండి అంటూ ఎద్దేవా చేశారు . మాట మీద నిలబడే తత్వం మీదైతే, మీరిచ్చిన లేఖకు విలువ అనేది ఉంటే ఇచ్చిన హామీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షాలను నిలదీయాలని సవాల్ విసిరారు ఏపీపీసీసీ చీఫ్.
ప్రైవేటీకరణ ఆపకపోతే మద్దతు ఉపసంహరణ అని డిమాండ్ పెట్టాలని కోరారు. ఆంధ్రుల హక్కు ముఖ్యమా ? లేదా బీజేపీతో పొత్తు ముఖ్యమా అనేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తేల్చుకోవాలని అన్నారు.