ఎంజీఆర్ పై ఎందుకింత ప్రేమో..!
కీలక వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్ రాజ్
హైదరాబాద్ – విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన ప్రకాశ్ రాజ్ ఎక్కడా తగ్గడం లేదు. ఆయన తన గొంతును వినిపిస్తూనే ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఒక వర్గానికి చెందిన వారు తనను టార్గెట్ చేసినా , ఆరోపణలు గుప్పించినా, తీవ్ర విమర్శలు చేసినా, వ్యక్తిగత హననం చేసినా ఎక్కడా తగ్గడం లేదు. నటుడిగా కాకుండా ఒక సగటు భారతీయుడిగా స్పందించే హక్కు, భావాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ తనకు ఉందని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.
ఆదివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి. తాజాగా తిరుపతి కల్తీ లడ్డు వివాదంతో పాటు సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పవన్ , ప్రకాశ్ రాజ్ ల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఇదే సమయంలో ట్వీట్ల వార్ కు తెర లేపారు.
తిరుపతి వారాహి డిక్లరేషన్ పేరుతో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. అది నేరుగా ఆ మధ్యన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారని ప్రచారం జరిగింది. ఇదే సమయంలో తాజాగా దివంగత సీఎం ఎంజీఆర్ గురించి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పొగిడారు.
ఈ సందర్బంగా ప్రకాశ్ రాజ్ సంచలన ట్వీట్ చేశారు. ఎంజీఆర్ పై హఠాత్తుగా ఎందుకింత ప్రేమో అని పేర్కొన్నారు. ఒకవేళ పై నుంచి ఆదేశాలు అందాయా అంటూ పేర్కొన్నారు. ఏమీ లేదు..జస్ట్ ఆస్కింగ్ అంటూ స్పష్టం చేశారు.