NEWSANDHRA PRADESH

డిప్యూటీ సీఎం ప్ర‌జా ద‌ర్బార్

Share it with your family & friends

భారీ ఎత్తున బాధితుల క్యూ

అమ‌రావ‌తి – ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆదివారం ప్ర‌జా ద‌ర్బార్ చేప‌ట్టారు. ఇవాళ ఏపీ ఆర్ డ‌బ్ల్యూ ఎస్ ల్యాబ్ ఉద్యోగులు క‌లుసుకున్నారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరారు. ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని విన్న‌వించారు.

గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పని చేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లేబరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు మంగ‌ళ‌గిరి కేంద్ర కార్యాల‌యంలో క‌లిశారు. రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని వాపోయారు.

తమకు ఉద్యోగ భద్రత కల్పించి, తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సమస్య పరిష్కరిస్తామని, పెండింగ్ జీతాలు క్లీయర్ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని హామీ ఇచ్చారు.

ఉద్యోగం తిరిగి ఇప్పించి ఆదుకోవాలంటూ జి. సుజన కుమారి అనే దివ్యాంగురాలు ప‌వ‌న్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేసింది. కడప జిల్లా కమలాపురం ల్యాబ్ లో గత పదేళ్లుగా హెల్పర్ గా పని చేస్తున్న తనను మూడు నెలల క్రితం విధులు నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.

పుట్టుకతో ఒక కిడ్నీ లేదని, బరువులను ఎత్తే పనులు చేయలేనని తెలిపారు. ఏ ఆధారం లేని తనకు తిరిగి ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని సుజన కుమారి వేడుకున్నారు.