విశాఖ కోసం చేసిన త్యాగాలు మరవద్దు
డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్
అమరావతి – విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నారనే దానిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకున్న తరుణంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదెల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనను విశాఖ స్టీల్ ప్లాంట్ సంఘాల కార్మికులు కలుసుకున్నారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం చేసిన త్యాగాలను మరచి పోవద్దని అన్నారు.
పరిశ్రమను కాపాడు కోవాలనే భావోద్వేగం కార్మికులు, ఉద్యోగులు, వారి సంఘాల్లో ఉండాలని స్పష్టం చేశారు. ఉద్యోగులు, కార్మికులు, భూ నిర్వాసితులు చేసిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి తెలియ చేస్తానని హామీ ఇచ్చారు.
32 మంది బలిదానాలు, 16 వేల మంది నిర్వాసితుల త్యాగాలు, 24 వేల ఎకరాల భూ సేకరణతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడిందన్న విషయం మరిచి పోవద్దన్నారు. వారి త్యాగాలతో ఏర్పడిన పరిశ్రమను కాపాడుకోవాలనే భావోద్వేగం ప్లాంట్ లో పని చేసే ప్రతి ఒక్కరితో పాటు కార్మిక, ఉద్యోగ సంఘాల నేతల్లో కూడా ఉండాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ కాకుండా కాపాడాలని కార్మిక సంఘాల ప్రతినిధులు కోరారు. 12,500 మంది ఉద్యోగులు, 14 వేలమంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని, వారికి కొద్ది నెలలుగా పలు అలవెన్సులు కూడా అందటం లేదని తెలిపారు. తమ ఆవేదనను కేంద్ర ప్రభుత్వానికి తెలియ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, ఐ.ఎన్.టి.యూ.సి., బి.ఎం.ఎస్., సి.ఐ.టి.యు.సి., ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్, టి.ఎన్.టి.యూ.సి., డి.ఎస్.యు, యూ.ఎస్.ఈ, వి.ఎం.ఎస్.యూనియన్, యూత్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు, జనసేన పార్టీ పి.ఏ.సి. సభ్యులు శ కోన తాతారావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు, భీమిలి పార్టీ ఇంచార్జ్ పంచకర్ల సందీప్ పాల్గొన్నారు.