NEWSTELANGANA

మూసీ పేరుతో సీఎం మోసం – కేటీఆర్

Share it with your family & friends

ఓ వైపు అప్పులు ఇంకో వైపు కోట్లు ఎలా

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయ‌న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. సోమ‌వారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. మూసీ సుందరీక‌ర‌ణ పేరుతో కోట్లు కొల్ల‌గొట్టేందుకు ప్లాన్ వేశాడ‌ని ఆరోపించారు. దీనిని తాము అడ్డుకుని తీరుతామ‌ని హెచ్చ‌రించారు కేటీఆర్.

మింగ మెతుకు లేదు కానీ, మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావాలె అన్నట్టుంది రేవంత్ రెడ్డి స‌ర్కార్ వైఖ‌రి అంటూ ఎద్దేవా చేశారు. తెల్లారి లేస్తే బీద అరుపులు. రాష్ట్రం అప్పుల పాలైంది అని, డబ్బులు లేవని, మరొకవైపు మూసి పేరిట ఈ లక్ష యాభై వేల కోట్ల సోకులు, ఆర్భాటం ఎవరి కోసమ‌ని ప్ర‌శ్నించారు కేటీఆర్.

రైతు రుణ మాఫీకి, రైతు బంధుకి, రైతు కూలీల‌కు , కౌలు రైతుల‌కు, నిరుద్యోగ భృతికి, పేదోళ్ల‌కు పెన్ష‌న్లకు సంబంధించి డ‌బ్బులు లేవ‌ని చెపుతున్నార‌ని వాపోయారు. మ‌హిళ‌ల‌కు మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం ఏమైంద‌న్నారు. ఆడ‌పిల్ల‌ల‌కు స్కూటీలు ఇస్తామ‌ని , ఉద్యోగుల‌కు డీఏ చెల్లిస్తామ‌ని చెప్పార‌ని వాటి గురించి ఎందుకు నోరు విప్ప‌డం లేద‌న్నారు.

అంతే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పుర‌పాలిక సంఘాల‌లో ప‌ని చేస్తున్న పారిశుధ్య కార్మికుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు వేత‌నాలు ఇవ్వ‌లేద‌న్నారు. గ్రామాల‌లో పిచికారీ మందుల‌కు, బ‌డిపిల్ల‌ల‌కు చాక్ పీస్ లు అందించేందుకు, ద‌ళిత బంధు కోసం డ‌బ్బులు లేవ‌న్నారు. వీటి గురించి ఆలోచించ‌కుండా మూసీ సుంద‌రీక‌ర‌ణ పేరుతో కోట్లు వెన‌కేసుకుందామ‌ని ప్లాన్ చేశాడ‌ని సీఎంపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.