NEWSTELANGANA

మైనంప‌ల్లి కామెంట్స్ పై మౌన‌మేల‌..?

Share it with your family & friends

తెలంగాణ డీజీపీని ప్ర‌శ్నించిన ఆర్ఎస్పీ

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. సోమ‌వారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా తీవ్రంగా స్పందించారు. ఆయ‌న ప్ర‌ధానంగా కాంగ్రెస్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు బ‌హిరంగంగా త‌మ పార్టీకి చెందిన మాజీ మంత్రులు కేటీఆర్, హ‌రీష్ రావుల‌ను టార్గెట్ చేయ‌డం, దారుణంగా మాట్లాడ‌టం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

అస‌లు రాష్ట్రంలో పాల‌న అనేది ఉందా అన్న అనుమానం క‌లుగుతోంద‌న్నారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. బంగారు తెలంగాణ నుండి చివ‌ర‌కు బెదిరింపుల తెలంగాణ‌గా మార్చేశారంటూ మండిప‌డ్డారు.
.
కేటీఆర్, హరీష్ రావు ల‌పై పెట్రోలు పోసి త‌గ‌ల బెడ‌తాన‌ని, ఇందు కోసం ప్లాన్ చేస్తున్నాన‌ని, అవ‌స‌ర‌మైతే జైలుకు పోయేందుకు సిద్దంగా ఉన్నానంటూ బ‌హిరంగంగా మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు ప్ర‌క‌టిస్తే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్ర‌శ్నించారు.

హ‌న్మంత‌రావు మాట్లాడిన ప్ర‌తి మాటా నేర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. వెంట‌నే కేసు న‌మోదు చేయకుండా ఇంకా తాత్సారం ఎందుకు చేస్తున్నారంటూ నిల‌దీశారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ డీజీపీని. నిజానికి దీని మీద పోలీసులు సుమోటో కేసు న‌మోదు చేయాల్సి ఉంద‌న్నారు.

తాము అక్టోబ‌ర్ 3వ తేదీన గ‌జ్వేల్ , సిద్దిపేట పోలీస్ స్టేష‌న్ల‌లో ఫిర్యాదు చేశామ‌ని ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించిన దాఖ‌లాలు లేవ‌న్నారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.