NEWSANDHRA PRADESH

జీవుల్ని ర‌క్షిస్తేనే మాన‌వ జాతికి మ‌నుగ‌డ

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్

అమ‌రావ‌తి – వ‌న్య ప్రాణుల‌ను కాపాడు కోవాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌న్నారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. మంగ‌ళగిరిలో వ‌న్య ప్రాణుల వారోత్స‌వాల‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన స‌భ‌లో ప్ర‌సంగించారు.

వసుధైక కుటుంబంలో సమస్త జీవ కోటి ఉందని పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు చెబుతున్నాయ‌ని అన్నారు. మనపై ఆధారపడిన జీవుల్ని రక్షిస్తేనే మానవ మనుగడ సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. లేక‌పోతే ప్ర‌మాదం లేక పోలేద‌ని పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణ, వన్య ప్రాణుల సంరక్షణపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ . ‘వసుధైక కుటుంబంలో సమస్త జీవ కోటికి చోటు ఉంది. వాటిలో మనిషి ఒకడు. మనకున్న సాంకేతికత, విజ్ఞానంతో ఇతర జీవ రాశుల కంటే మనం ఉన్నత దశలో ఉన్నాం. మనపై ఆధారపడిన, మనతోపాటు జీవనం సాగించే ఇతర జీవ రాశులన్నింటినీ రక్షించుకుంటేనే మనిషి సాగిస్తున్న ఈ దశ స్వచ్ఛంగా సాగిపోతుంది. ఈ మాటలనే వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్నాయి’ అని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.

వన్య ప్రాణులు, సముద్ర జీవులు, ఇతర జీవరాశి పూర్తి మనుగడలో ఉంటేనే మనిషికి స్వచ్ఛమైన గాలి, నీరు అందుతుందన్నారు. ఇతర జీవుల మనుగడ మీద మన ఉనికి ఆధారపడి ఉందనే విషయం నిత్యం గుర్తుంచుకోవాలని సూచించారు. పర్యావరణ, వన్య ప్రాణుల సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని అన్నారు.