దివాలా అంచున కాంగ్రెస్ పాలన – రాకేశ్ రెడ్డి
నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ సీనియర్ నేత
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ ఏనుగుల రాకేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరాక రాష్ట్రం ఆర్థికంగా చితికి పోయిందన్నారు. ప్రధానంగా ఖజానాకు వనరుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం హైడ్రా దెబ్బకు కుదేలైందని వాపోయారు. కూల్చి వేతల దెబ్బకు రిజిస్ట్రేషన్లు ఆగి పోయాయని, పెట్టుబడులు రావడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని ఆరోపించారు రాకేశ్ రెడ్డి.
మూసి సుందరీకరణ అనేది ఒక డ్రామా అని అది కేవలం ధనార్జన కోసమే తెస్తున్న ప్రాజెక్ట్ అని మండిపడ్డారు. మూసిలో పారేది నీళ్ళు కాదు, ప్రజల కన్నీళ్లు అని పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభం దిశగా తెలంగాణ రాష్ట్రం అడుగులు వేస్తోందన్నారు. మరికొద్ది రోజులు వెళ్తే రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాల్సిన పరిస్థితి ఏర్పడే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డికి సొంతంగా విజన్ లేదు. ఎవరు ఏది చెప్తే అదే చేస్తూ రాష్ట్రాన్ని సంక్షోభం లోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాకేశ్ రెడ్డి. ప్రజల ఆదాయం తగ్గుతుంటే మరో వైపు రేవంత్ రెడ్డి అతని సోదరుల ఆదాయం పెరుగుతోందన్నారు. దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సంపూర్ణ రుణమాఫీ అయిందని రేవంత్ రెడ్డి ఇన్నాళ్లు చెప్పిన మాటలు అబద్ధమని తాను ప్రధాని కి రాసిన లేఖలో 18 వేల కోట్లు మంజూరు చేశామని బయట పెట్టారని అన్నారు. హరీష్ రావు, కేటీఆర్ చెప్పిందే నిజమైందని, ఇన్నాళ్లు అబద్ధాలు అడి ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాస్తాడా అని నిలదీశారు రాకేశ్ రెడ్డి.