DEVOTIONAL

వేణుగోపాల‌స్వామి అలంకారంలో శ్రీ మలయప్ప

Share it with your family & friends

క‌ల్ప‌వృక్ష వాహనంపై శ్రీ‌వారు

తిరుమల – తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమ‌వారం ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి వేణుగోపాల‌స్వామి అలంకారంలో క‌ల్ప‌వృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

వాహనం ముందు గజ రాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

క్షీర సాగర మథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్ప వృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు. పూర్వ జన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాక క‌ల్ప‌వృక్షం కోరుకున్న‌ ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి క‌ల్ప‌వృక్ష‌ వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు శ్రీ‌వారు ద‌ర్శ‌న‌మిచ్చారు.

రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స‌ర్వ‌భూపాల వాహనంపై స్వామి వారు అభ‌య‌మిస్తారు. వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఈవో జె.శ్యామ‌ల‌రావు, అద‌న‌పు ఈవో శ్రీ సిహెచ్ వెంక‌ట‌య్య చౌద‌రి, జెఈవోలు గౌత‌మి, వీర‌బ్ర‌హ్మం ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.