NEWSTELANGANA

హెచ్ ఆర్ టి సి లో ఎల్ 1 గా ఒలెక్ట్రా

Share it with your family & friends

హైద‌రాబాద్ సంస్థ‌కే ద‌క్కిన టెండ‌ర్

హైద‌రాబాద్ – విద్యుత్ బస్సుల కొనుగోలుకు హిమాచల్ రోడ్డు రవాణా సంస్థ (హెచ్ ఆర్ టి సి) పిలిచిన టెండర్లలో ఒలెక్ట్రా గ్రీన్టెక్ తక్కువ ధర కోట్ చేసి ఎల్ 1 బిడ్దర్ గా నిలిచింది. హెచ్ ఆర్ టి సి 327 విద్యుత్ బస్సుల కొనుగోలుకు తాజాగా టెండర్లు పిలిచింది. ఇందులో తొమ్మిది మీటర్ల బస్సులు 297, 12 మీటర్ల బస్సులు 30 ఉన్నాయి.

ఒలెక్ట్రా గ్రీన్ టెక్, స్విచ్ మొబిలిటీ టెండర్లలో పాల్గొన్నాయి. టెండర్ ప్రక్రియ అనంతరం నిర్వహించిన సాంకేతిక పరీక్షల్లో రెండు సంస్థలు అర్హత సాధించాయి. అయితే తక్కువ ధర కోట్ చేసి ఒలెక్ట్రా సంస్థ అంతిమంగా ఎల్ 1 గా నిలిచింది.

హిమాచల్ రాష్ట్ర ప్రజల అవసరాల నిమిత్తం త్వరితగతిన బస్సులను కొనుగోలు చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్న ఆర్ టి సి త్వరలో ఆర్డర్ ఖరారు చేయనుంది. కర్బన ఉద్గారాలను తగ్గించాలనే ఉద్దేశంతో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టిన రోడ్డు రవాణా సంస్థల్లో హెచ్ ఆర్ టి సి ఒకటి.

2017 సెప్టెంబర్లో ఈ సంస్థ విద్యుత్ బస్సులను తొలిసారి కొనుగోలు చేసింది. ఒలెక్ట్రా సంస్థ అపుడు 25 బస్సులను విక్రయించింది. వాటిని కులు మనాలి రోహ్తాంగ్ మధ్య ఆర్ టి సి నడుపుతోంది. మనాలి రోహ్తాంగ్ మధ్య 13 వేల కిలోమీటర్ల ఎత్తులో ఈ బస్సులు నడుస్తున్నాయి.

ప్రపంచంలో ఈ ఎత్తులో ఒలెక్ట్రా విద్యుత్ బస్సులు నడుస్తూ రికార్డ్ సృష్టించాయి. అత్యధిక ఎత్తులో కూడా ఒలెక్ట్రా బస్సులు నడుస్తూ అద్వితీయమైన పనితీరును కనపరుస్తున్నాయి. హిమాచల్ కొండల్లో పర్యావరణాన్ని పరిరక్షించడంలో ఒలెక్ట్రా బస్సులు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

హెచ్ ఆర్ టి సి కి సరఫరా చేయనున్న బస్సులో ప్రయాణికుల సౌకర్యార్ధం అత్యాధునిక సౌకర్యాలను ఒలెక్ట్రా పొందు పరచనుంది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్(ఏ డి ఏ ఎస్), ఎయిర్ సస్పెన్షన్ , ఎలక్ట్రిక్ స్టెబిలిటీ కంట్రోల్ తో కూడిన డిస్క్ బ్రేక్ వ్యవస్థ ఇందులో ఉంటాయి.

తొమ్మిది మీటర్ల నిడివి గల బస్సులు ఒకసారి ఛార్జ్ చేస్తే 180 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. డ్రైవర్ తో కలిపి 31 మంది ఇందులో ప్రయాణించవచ్చు. 12 మీటర్ల బస్సులు ఒకసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఇందులో డ్రైవర్ తో కలిపి 38 మంది ప్రయాణించవచ్చు.