కేంద్ర మంత్రితో చంద్రబాబు భేటీ
సమస్యలు పరిష్కరించాలని వినతి
న్యూఢిల్లీ – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా తొలుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలుసుకున్నారు. ఈ సందర్బంగా ఏపీలో రైల్వే లైన్ల ఏర్పాటు, కొత్త రైళ్ల ప్రతిపాదన, తదితర సమస్యలను ఏకరువు పెట్టారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి వినతి పత్రం సమర్పించారు.
వైజాగ్ ప్రధాన కార్యాలయంగా రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించిన దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న హామీని ముందుకు తీసుకెళ్లినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. డిసెంబరు నాటికి కొత్త జోన్‌కు శంకుస్థాపన చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ అంతటా వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో భాగంగా రైల్వే శాఖ రూ. 73,743 కోట్ల పెట్టుబడి పెడుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టులలో APలోని హౌరా-చెన్నై మధ్య 4-లేనింగ్, 73 స్టేషన్లను ఆధునీకరించడం , మరిన్ని లోకల్ రైళ్లను ప్రవేశపెట్టడం ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లాజిస్టికల్ & కమ్యూటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేయడానికి భారతీయ రైల్వేలతో భాగస్వామ్యం కోసం ఏపీ ఎదురు చూస్తోందని ఈ సందర్బంగా మంత్రికి చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.