హ్యాండ్లూమ్ క్లస్టర్ ను ఏర్పాటు చేయండి
చేనేత కార్మికులను ఆదుకోవాలని విన్నపం
ఢిల్లీ – ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా కేంద్ర జౌళి, చేనేత శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వినతి పత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో హ్యాండ్లూమ్ క్లస్టర్ ను ఏర్పాటు చేయాలని విన్నవించారు. తక్షణమే సహాయం చేయాలని కోరారు సత్య కుమార్ యాదవ్.
శతాబ్దాల తరబడి వస్తున్న సంప్రదాయం, నాణ్యమైన పట్టు చీరలకు ధర్మవరం ప్రసిద్ధి చెందిందని తెలిపారు కేంద్ర మంత్రికి. క్లస్టర్ సుస్థిరతను నిర్ధారిస్తుంది, పోటీతత్వాన్ని పెంచుతుంది, నేత కార్మికులకు మార్కెట్ పరిధిని పెంచుతుందన్నారు.
ప్రాజెక్ట్ యొక్క అంచనా వ్యయం రూ. 30 కోట్లు అవుతుందని, ఇందులో భాగంగా 80 శాతం కేంద్ర సర్కార్ నుంచి రూ. 24 కోట్లు కాగా ఏపీ సర్కార్ నుంచి రూ. 6 కోట్లు సమకూర్చుతుందని స్పష్టం చేశారు సత్యకుమార్ యాదవ్.
ఇదిలా ఉండగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ను ఏర్పాటు చేసేందుకు కావాల్సిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ను సమర్పించడం జరిగిందని తెలిపారు రాష్ట్ర మంత్రి. కేంద్ర మంత్రిని కలిసిన అనంతరం సత్య కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. తాను చేసిన విన్నపానికి గిరిరాజ్ సింగ్ సానుకూలంగా స్పందించారని చెప్పారు.