కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలేవీ..?
సీఎంను ప్రశ్నించిన విజయసాయి రెడ్డి
అమరావతి – వైసీపీ రాజ్యసభ సబ్యుడు విజయ సాయి రెడ్డి నిప్పులు చెరిగారు. మంగళవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఏపీ కూటమి ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. చంద్రబాబు నాయుడు మాటలు తప్పా ఆచరణలో ఏ ఒక్క పని చేయడం లేదని ఆరోపించారు.
నిధులు పెద్ద ఎత్తున వస్తున్నాయంటూ ఊదరగొట్టారని కానీ కాంట్రాక్టు పద్దతిన పని చేస్తున్న వందలాది మంది ఉద్యోగులకు ఇప్పటి వరకు వేతనాలు చెల్లించక పోవడం దారుణమన్నారు. ప్రస్తుతం దసరా, దీపావళి పండుగలు వస్తున్నాయని ఈ తరుణంలో జీతాలు రాక నానా తంటాలు పడుతున్నారని విజయ సాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
సమగ్ర సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) కింద 25,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు గత రెండు నెలలుగా జీతాలు చెల్లించలేదని ఆరోపించారు ఎంపీ. అంతే కాకుండా ఆపద సమయంలో ప్రాణాలు రక్షించే 108, 104 సిబ్బంది 6,500 మందికి జూలై నుంచి వేతనాలు ఇవ్వలేదని మండిపడ్డారు.
వీరే కాకుండా అనేక శాఖలలో పని చేసత్ఉన్న వేలాది మంది చిరుద్యోగుల జీవితాల్లో పండుగలు వస్తున్నా చిమ్మ చీకట్లు తొలగి పోలేదని వాపోయారు విజయ సాయి రెడ్డి. చంద్రబాబు పాలన గాడి తప్పిందన్నారు.