NEWSTELANGANA

ఎంబీబీఎస్ సీట్లు పొందిన విద్యార్థుల‌కు కంగ్రాట్స్

Share it with your family & friends

అభినందించిన మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ – మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

మూడు లక్షలకు పైగా ర్యాంకులు వచ్చిన తెలంగాణా విద్యార్థులకు కూడా కన్వీనర్ కోటాలో ఎంబిబిఎస్ సీట్లు రావడం సంతోషించదగ్గ విషయమ‌ని పేర్కొన్నారు.

బీసీ-ఏ కేటగిరిలో 3.35 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి, ఎస్సీ కేటగిరీలో 3.11 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి, ఎస్టీ కేటగిరీలో 2.89 లక్షల ర్యాంకు, బీసీ-బి లో 2.27 లక్షలు, బీసీ-సీ లో 3.14 లక్షలు, బీసీ-డి లో 2.13 లక్షలు, బీసీ-ఈ లో 2.24 లక్షల గరిష్ట ర్యాంకులు సాధించిన వారికి ఎంబీబీఎస్ సీట్లు రావడం చరిత్రలో ఇదే మొదటిసారి అని తెలిపారు.

మారుమూల ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేయడం, తెలంగాణ బిడ్డలు డాక్టర్ కావాలనే కలను స్వరాష్ట్రంలోనే వుండి సుసాధ్యం చేసుకోవాలని కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజి ఏర్పాటు చేశారని వెల్ల‌డించారు త‌న్నీరు హ‌రీశ్ రావు.

కేసిఆర్ పాలనలో గడిచిన పదేళ్ల కాలంలో రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 5 నుండి 34 కు పెంచ‌డం జ‌రిగింద‌న్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 20 నుండి 60 కి చేరాయ‌న్నారు.

వైద్య విద్యకు తెలంగాణను కేరాఫ్ అడ్రస్ గా చేసిన ఘనత కేసీఆర్ గారికి, బిఆర్ఎస్ పార్టీకి దక్కుతుందన్నారు. దీంతో తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2850 నుండి 8315 లకు పెరిగి, ఎంబీబీఎస్ చదవాలనుకునే విద్యార్థులకు అవకాశాలు గణనీయంగా పెరిగాయ‌ని స్ప‌ష్టం చేశారు.

వైద్య విద్య కోసం చైనా, ఉక్రెయిన్, రష్యా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో పెరిగిన మెడికల్ సీట్లను విద్యార్థులు అంది పుచ్చుకోవాలని, తెలంగాణాలో ఉంటూ వైద్య విద్య చదివి దేశానికి సేవ చేయాలని ఆకాంక్షిస్తున్న‌ట్లు కోరారు త‌న్నీరు హ‌రీశ్ రావు.