బాలికపై అఘాయిత్యం అమానుషం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పిఠాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద నిన్న సాయంత్రం అఘాయిత్యం జరిగిందని తెలిసి చాలా బాధ కలిగిందన్నారు.
ఆ సమయంలో అప్రమత్తమైన స్థానికులు నిందితుణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చిందన్నారు. లేనిపక్షంలో నిందితుడు తప్పించు కోవడానికి ఆస్కారం కలిగేదన్నారు.
ఈ అమానుష చర్యను సభ్య సమాజం లోని ప్రతి ఒక్కరు ఖండించాలని అన్నారు పవన్ కళ్యాణ్. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ దుస్సంఘటన గురించి తెలిసిన వెంటనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులను ఆదేశించానని చెప్పారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా బాధితురాలిని, వారి కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు అందచేస్తామన్నారు.
ముద్దాయికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం. ఇటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. స్థానిక జనసేన నాయకులను కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి, సహాయం అందించాలని ఆదేశించామన్నారు.