NEWSANDHRA PRADESH

క‌డ‌ప జిల్లా పేరు మారిస్తే ఊరుకోం – వైసీపీ

Share it with your family & friends

మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ పై ఫైర్

వైఎస్సార్ జిల్లా – క‌డ‌ప వైఎస్సార్ జిల్లా పేరును మార్చాల‌ని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు లేఖ రాయడాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది వైసీపీ. ఆ పార్టీ క‌డ‌ప జిల్లా అధ్య‌క్షుడు ర‌వీంద్ర నాథ్ రెడ్డి మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో స‌వాల‌క్ష స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, వాటిపై ఫోక‌స్ పెట్ట‌కుండా త‌మ జిల్లా గురించి మంత్రి మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. వైఎస్ఆర్ జిల్లాగా 2010 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.

ఇప్పుడు మళ్ళీ కడప జిల్లా గా పేరు మార్చాలని పక్క జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి మాట్లాడటం హేయమైన చర్య అని తీవ్ర స్థాయిలో మండి ప‌డ్డారు ర‌వీంద్ర నాథ్ రెడ్డి.

ఈ అంశం పై ముఖ్యమంత్రి కి లేఖ రాయడం దారుణ‌మ‌న్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఆయన చేసిన సేవలు వెల కట్టలేనివని అన్నారు పార్టీ చీఫ్‌.

ఆయనకు గుర్తింపుగా ఆయన మరణం తర్వాత కడప జిల్లా కు వైఎస్ఆర్ జిల్లా అని నామకరణం చేశారని తెలిపారు. అప్పట్లో టీడీపీ ఈ అంశాన్ని కూడా వ్యతిరేకించ లేద‌ని గుర్తు చేశారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఏకైక నాయకుడు వైఎస్ ఒక్కరేన‌ని స్ప‌ష్టం చేశారు.

ప్రతి పేదవాడికి అందాల్సిన ఫలాలను అందించిన మహనీయుడు అని కొనియాడారు. దేశంలో ఎప్పుడు ఏ రాష్ట్రంలో అమలు చేయాలని పథకాలను తీసుకు వ‌చ్చార‌ని అన్నారు.

108, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్మెంట్, ఉచిత విద్యుత్, మహిళలకు ఎన్నో పథకాలు, కులాల వారీగా ప్రతి ఒకరికి న్యాయం చేసిన వ్యక్తి వైఎస్ అని స్ప‌ష్టం చేశారు. తిరిగి కడప జిల్లా గా మారుస్తామంటే ఇక్కడి ప్రజలు ఎవరు ఊరుకోరని హెచ్చ‌రించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులు, కార్యకర్తలతో ఉద్యమాలను ఉదృతం చేస్తామ‌న్నారు. ఇప్పటికైనా ఆ ఆలోచన మానుకోవాలని మంత్రి సత్యకుమార్ ను డిమాండ్ చేశారు.