DEVOTIONAL

వైభ‌వోపేతం గ‌రుడ సేవ మ‌హోత్స‌వం

Share it with your family & friends

పోటెత్తిన భ‌క్తులు ఘ‌నంగా బ్ర‌హ్మోత్స‌వాలు
తిరుమ‌ల – తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన మంగ‌ళ‌వారం రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారు త‌న‌కు ఎంతో ప్రీతి పాత్ర‌మైన గ‌రుడ వాహ‌నంపై లక్ష్మీ కాసుల మాల ధరించి భ‌క్తుల‌కు అభ‌య‌మిచ్చారు.

సాయంత్రం 6.30 గంటలకు గ‌రుడ‌సేవ ప్రారంభ‌మైంది. వాహనం ముందు గజ రాజులు నడుస్తుండగా, భక్త జన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

ఇక పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామి వారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియ చెబుతారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవై రాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్త కోటికి తెలియ జెబుతున్నాడు.

వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో జె శ్యామలరావు, అద‌న‌పు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు గౌత‌మి, వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ‌ధ‌ర్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.