షిండే సూచన పవన్ కళ్యాణ్ అభినందన
ఏపీ డిప్యూటీ సీఎంతో ప్రముఖ నటుడి భేటీ
అమరావతి – ప్రముఖ విలక్షణ నటుడు షాయాజీ షిండే మర్యాద పూర్వకంగా ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ను కలుసుకున్నారు. ఈ సందర్బంగా వీరిద్దరూ కీలక అంశాలపై చర్చించారు. ఇదే సమయంలో కీలక సూచనలు చేశారు నటుడు షిండే. ఆలయాలను దర్శించుకునే భక్తులకు ప్రసాదంతో పాటు ఓ మొక్కను కూడా ఉచితంగా అందజేస్తే బాగుంటుందని సూచించారు.
షిండే చేసిన విలువైన సూచనను ప్రత్యేకంగా అభినందించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్బంగా ఆయనకు కంగ్రాట్స్ తెలిపారు. మొక్కలను అందించడం వల్ల పచ్చదనం పెరుగుతుందన్నారు. షాయాజీ షిండే చేసిన ప్రతిపాదన గురించి తాను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చిస్తానని చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం.
ఆధ్యాత్మికతకు పర్యావరణ శక్తి కలిస్తే భావి తరాలకు మేలు జరుగతుందన్నారు. ముంబై లోని మూడు ప్రధాన ఆలయాల్లో మొక్కలతో పాటు ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నామని చెప్పారు షాయాజీ షిండే. దీనికి వృక్ష ప్రసాద్ యోజన అని పేరు పెట్టడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా మొక్కలు, వాటి విశిష్టత గురించి మరాఠీలో రాసుకున్న కవితను పవన్ కళ్యాణ్ కు చదివి వినిపించారు. ఆ కవితను పవన్ కళ్యాణ్ గారు ప్రశంసిస్తూ ఆ మరాఠీ కవితను తెలుగులో అనువదించి చెప్పడం విశేషం.