ఈ విజయం మరింత బాధ్యతను పెంచింది – పీఎం
నరేంద్ర దామోదర దాస్ మోడీ కామెంట్
ఢిల్లీ – హర్యానా రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమి అభాసు పాలైందని అన్నారు. ప్రజలు ఇప్పటికీ దేశ వ్యాప్తంగా బీజేపీ సర్కార్ పై, తన నాయకత్వంపై పూర్తి నమ్మకంతో, అంతకు మించిన విశ్వాసంతో ఉన్నారని చెప్పారు.
హర్యానాలో గెలుపొందిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధానమంత్రి మోడీ కీలక ప్రసంగం చేశారు. ఈ విజయం పార్టీపైనే కాకుండా తనపై మరింత బాధ్యతను పెంచేలా చేసిందని చెప్పారు. అమలు చేసిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయడంలో బీజేపీ ప్రభుత్వం కృషి చేసిందని, అక్కడ సక్సెస్ అయ్యిందని అన్నారు. పూర్తి మెజారిటీని ప్రజలు కట్ట బెట్టారని, వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు చెప్పారు మోడీ.
అంతే కాదు జమ్మూ కాశ్మీర్ లో పోటీ చేసిన 43 స్థానాలలో 29 స్థానాలు మనకు దక్కడం ఆనందంగా ఉందన్నారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో తమ పార్టీకి అత్యధికంగా ఓట్లు రావడం తనను విస్తు పోయేలా చేసిందన్నారు. ఈ సందర్బంగా గెలుపొందిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నట్లు తెలిపారు మోడీ.