ప్రభుత్వ నిర్లక్ష్యం ఏపీపీఎస్సీకి శాపం – షర్మిల
చైర్మన్ , సభ్యుల నియామకం మాటేమిటి..?
విజయవాడ – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ సర్కార్ ను ఏకి పారేశారు. బుధవారం షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారని, వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని అన్నారని దాని ఊసే లేదన్నారు. ప్రధానంగా ఏపీ కూటమి సర్కార్ కావాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఒక రాజ్యాంగబద్ధ సంస్థకు నాలుగు నెలలుగా చైర్మన్ లేక పోవడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. దేశ చరిత్రలోనే ఇది తొలిసారి అంటూ ఎద్దేవా చేశారు.
మీ ప్రక్షాళన రాజకీయాలకు నిరుద్యోగులను బలి చేస్తున్నారంటూ మండిపడ్డారు ఏపీపీసీసీ చీఫ్. శ్వేత పత్రాల మీద పెట్టిన శ్రద్ద కమిషన్ బలోపేతంపై ఫోకస్ పెట్టక పోవడం దారుణమన్నారు. చైర్మన్ నియామకం జరగక కొత్త నోటిఫికేషన్లు రావడం లేదన్నారు. విడుదలైన వాటికి పరీక్షల నిర్వహణ లేదన్నారు.
వాయిదా వేసిన గ్రూప్ 1, గ్రూప్ 2, లాంటి పరీక్షలను మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియదన్నారు. ఏపీపీఎస్సీ పరిధిలో 21 రకాల పరీక్షలు పెండింగ్ పడ్డాయంటే, ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుందన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.