ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం – సీఎం
తెలంగాణ డీఎస్సీకి ఎంపికైన వారికి పత్రాలు
హైదరాబాద్ – తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో నిర్వహించిన డీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి నియామక పత్రాలు అందజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. బుధవారం హైదరాబాద్ లో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు సీఎం. గత ప్రభుత్వ హయాంలో కల్వకుంట్ల కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయని వాళ్లను ఊడ గొడితేనే మీకు ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. పోరాడి, ఆత్మ బలిదానాల సాక్షిగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రెండు సార్లు బీఆర్ఎస్ ను గెలిపిస్తే జాబ్స్ భర్తీ చేయకుండా కొరివి దెయ్యం కేసీఆర్ నిర్లక్ష్యం చేశాడని ధ్వజమెత్తారు ఎ. రేవంత్ రెడ్డి.
లక్షలాది మంది నిరుద్యోగుల పాలిట శాపంగా మారడంతో గత్యంతరం లేక తమకు అధికారాన్ని అప్పగించారని అన్నారు. ఈ సందర్బంగా తాము ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు తమ ప్రభుత్వ హయాంలో 30 వేల జాబ్స్ ను భర్తీ చేయడం జరిగిందని చెప్పారు.
ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత ఉద్యోగాలు ఊడ గొట్టాలని ఆనాడే చెప్పానని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 21 వేల మంది టీచర్లకు పదోన్నతులు కల్పించడం జరిగిందన్నారు. అయినా నోటిఫికేషన్లు ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు.