దివికేగిన పారిశ్రామిక దిగ్గజం
రతన్ టాటా ఇక లేరు
ముంబై – యావత్ భారత దేశం గర్వించ దగిన దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా ఇక లేరు. సెలవంటూ ఈ లోకాన్ని వీడారు. కోట్లాది సంపదను సృష్టించి..లక్షలాది మందికి నీడను కల్పించిన రతన్ టాటా గురువారం కన్ను మూశారు. రతన్ టాటా మృతితో గొప్ప మానవుడిని, మానవతావాదిని, అరుదైన ఇండస్ట్రియలిస్ట్ ను దేశం కోల్పోయింది. ఆయన లేని లోటు తీర్చ లేనిది. పూడ్చ లేనిది కూడా.
రతన్ టాటా వయసు 86 ఏళ్లు. ఆయన ప్రస్థానం అద్భుతం. స్పూర్తి దాయకం కూడా. 1991లో ఉక్కు పరిశ్రమ నుంచి సాఫ్ట్ వేర్ కంపెనీలతో కూడిన టాటా గ్రూప్ సంస్థలకు చైర్మన్ అయ్యాడు . తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను నమ్మ వద్దని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని స్వయంగా ప్రకటించారు. కానీ అంతలోనే అందరినీ విషాదంలో ముంచేసి వెళ్లి పోయారు రతన్ టాటా.
వ్యాపారంలో మోసానికి తావు ఉండ కూడదని, నాణ్యత ఉండాలని, అంతకంటే మించి పని చేసే ప్రతి ఒక్కరినీ తమ వారిగా భావించాలని స్పష్టం చేశారు. చెప్పడమే కాదు రతన్ టాటా ఆచరించి చూపించారు. సంపాదించిన కోట్లాది రూపాయలలో ఎక్కువగా సాయం చేయడం పైనే దృష్టి సారించారు. తమ గ్రూపులోని కంపెనీలలో ఒక్కసారి ఎంపికైతే ఇక ప్రభుత్వ ఉద్యోగం కంటే ఎక్కువగా భద్రతతో ఉండేలా తీర్చిదిద్దారు రతన్ టాటా.
ఇదిలా ఉండగా 143 కోట్ల భారతీయులను విచారంలో ముంచేసి వెళ్లి పోయారు రతన్ టాటా. ఈ సందర్భంగా రతన్ నావల్ టాటాకు మేము వీడ్కోలు పలుకుతున్నాము. ఇది చెప్పలేనంత నష్టం మాకు. నిజంగా ఆయన అసాధారణమైన నాయకుడు. ఆయన అమూల్యమైన సహకారం టాటా గ్రూప్ ను మాత్రమే కాదు యావత్ దేశాన్ని కూడా ప్రభావితం చేసిందని తీవ్ర భావోద్వేగంతో పేర్కొన్నారు టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ . చంద్రశేఖరన్ అర్ధరాత్రి విడుదల చేసిన ప్రకటనలో.
టాటా సంస్థలకు రతన్ నావల్ టాటా చైర్ పర్సన్ కంటే ఎక్కువ. ఆయన ఒక గురువు..అంతే కాదు మార్గదర్శకుడు, స్నేహితుడు కూడా. టాటా నుంచి ప్రతి క్షణం ప్రేరణ పొందుతూ వచ్చాను. టాటా సారథ్యంలో టాటా గ్రూప్ శ్రేష్టత, సమగ్రత, ఆవిష్కరణల పట్ల తిరుగులేని నిబద్దతతో కొనసాగుతూ వచ్చింది. ప్రపంచ పారిశ్రామిక రంగంపై విస్మరించ లేని పాద ముద్రలను వేసిందన్నారు చంద్రశేఖరన్.
రతన్ టాటా దాతృత్వానికి చిరునామా. విద్య నుండి ఆరోగ్య సంరక్షణ దాకా చేపట్టిన కార్యక్రమాలు చేసిన సాయం నేటి తరాలకే కాదు రాబోయే తరాలకు స్పూర్తి దాయకంగా నిలుస్తాయని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా రతన్ టాటా కన్ను మూశారని తెలియగానే దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం తెలిపారు. దయగల ఆత్మ, అసాధారణ మానవుడు రతన్ టాటా అని కొనియాడారు.