రతన్ టాటా లేని లోటు పూడ్చ లేనిది
టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్
ముంబై – దిగ్గజ భారతీయ పారిశ్రామిక వేత్త రతన్ టాటా ఇక లేరని చెప్పేందుకు మనసు రావడం లేదు. అత్యంత బాధాకరమని టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు. గురువారం ఆయన సంస్థ తరపున కీలక ప్రకటన చేశారు. ఈ సందర్బంగా రతన్ టాటతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇవాళ కోట్లాది మందిని ప్రభావితం చేసిన అరుదైన పారిశ్రామికవేత్త, మానవతావాది, ఎందరికో మార్గదర్శకుడిగా నిలిచిన రతన్ టాటా లేరన్న వాస్తవాన్ని ఇంకా జీర్ణించు కోలేక పోతున్నామని వాపోయారు చంద్రశేఖరన్.
వ్యాపారంలో మోసానికి తావు ఉండ కూడదని, నాణ్యత ఉండాలని, అంతకంటే మించి పని చేసే ప్రతి ఒక్కరినీ తమ వారిగా భావించాలని స్పష్టం చేశారని పేర్కొన్నారు. చెప్పడమే కాదు రతన్ టాటా ఆచరించి చూపించారని కొనియాడారు. సంపాదించిన కోట్లాది రూపాయలలో ఎక్కువగా సాయం చేయడం పైనే దృష్టి సారించారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రతన్ నావల్ టాటాకు మేము వీడ్కోలు పలుకుతున్నాము. ఇది చెప్పలేనంత నష్టం మాకు. నిజంగా ఆయన అసాధారణమైన నాయకుడు. ఆయన అమూల్యమైన సహకారం టాటా గ్రూప్ ను మాత్రమే కాదు యావత్ దేశాన్ని కూడా ప్రభావితం చేసిందని తీవ్ర భావోద్వేగంతో పేర్కొన్నారు టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ . చంద్రశేఖరన్ .
టాటా సంస్థలకు రతన్ నావల్ టాటా చైర్ పర్సన్ కంటే ఎక్కువ. ఆయన ఒక గురువు..అంతే కాదు మార్గదర్శకుడు, స్నేహితుడు కూడా. టాటా నుంచి ప్రతి క్షణం ప్రేరణ పొందుతూ వచ్చాను. టాటా సారథ్యంలో టాటా గ్రూప్ శ్రేష్టత, సమగ్రత, ఆవిష్కరణల పట్ల తిరుగులేని నిబద్దతతో కొనసాగుతూ వచ్చింది. ప్రపంచ పారిశ్రామిక రంగంపై విస్మరించ లేని పాద ముద్రలను వేసిందన్నారు చంద్రశేఖరన్.
రతన్ టాటా దాతృత్వానికి చిరునామా. విద్య నుండి ఆరోగ్య సంరక్షణ దాకా చేపట్టిన కార్యక్రమాలు చేసిన సాయం నేటి తరాలకే కాదు రాబోయే తరాలకు స్పూర్తి దాయకంగా నిలుస్తాయని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా రతన్ టాటా కన్ను మూశారని తెలియగానే దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం తెలిపారు. దయగల ఆత్మ, అసాధారణ మానవుడు రతన్ టాటా అని కొనియాడారు.