నిజమైన భారత రత్నం రతన్ టాటా
గొప్ప మానవుడిని కోల్పోయిన దేశం
హైదరాబాద్ – భారత దేశ పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ సంస్థల చీఫ్ రతన్ టాటా ఇక లేరు. ఆయన ఈ లోకాన్ని వీడారన్న విషయం తెలిసి బాధకు గురయ్యానని పేర్కొన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి. గురువారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. టాటా అంటేనే ట్రస్ట్ అని, ఈ ప్రపంచంలో భూమి, ఆకాశం ఉన్నన్ని రోజులు రతన్ టాటా , ఆయన పెంచి పోషించిన టాటా గ్రూప్ పదిలంగా ఉంటుందని స్పష్టం చేశారు.
విలువలతో కూడిన వ్యాపారం చేస్తూ, వ్యాపారం అంటే కేవలం ఆదాయం మాత్రమే కాదని అభిమానం, ఆత్మీయత అనీ నిరూపించిన మహోన్నత మానవుడు రతన్ టాటా అని కొనియాడారు. భారతీయుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన గొప్ప వ్యాపారవేత్త. నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం ఆయన అని పేర్కొన్నారు ఏనుగుల రాకేశ్ రెడ్డి..
దేశం సంకట స్థితిలో ఉన్నప్పుడు అన్నీ మరిచి ఆపన్న హస్తాన్ని అందించిన అచంచల దేశ భక్తుడు రతన్ టాటా అని ప్రశంసలు కురిపించారు. పేద, మధ్య తరగతి వాళ్ల కష్టాలను దూరం చెయ్యడమే వ్యాపారమని, ఆదాయం కంటే ఆత్మ సంతృప్తి గొప్పదని నమ్మిన మానవతావాది రతన్ టాటా అని అన్నారు.
మంచి మనసుతో కొట్లాది భారతీయుల హృదయాలను దోచుకొని గొప్ప లాభాన్ని సంపాదించి ఆ భగవంతుడే ఆశ్చర్య పోయేలా ప్రేమాభిమానాలను వెంట బెట్టుకొని వెళ్లిన సిసలైన భారత రత్నం రతన్ టాటా అని, ఆయనకు కన్నీటి నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు .