దార్శనికుడు రతన్ టాటా – కేసీఆర్
ఆయన మృతి దేశానికి తీరని లోటు
హైదరాబాద్ – భారతదేశ వ్యాపార దిగ్గజం రతన్ టాటా మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్. గురువారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన లేరన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని పేర్కొన్నారు. ఇది అత్యంత విషాదకరమైన రోజు అని అన్నారు.
రతన్ టాటా వ్యక్తి కాదు వ్యవస్థ. వ్యాపారానికి విలువలు ఉండాలని స్పష్టం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఏది చెప్పారో అది ఆచరణలో ఉండేలా చూశారని, కోట్లాది మందికి స్పూర్తి దాయకంగా నిలిచారని ప్రశంసించారు కేసీఆర్.
భారతీయ పరిశ్రమను మార్చిన, తరాలకు స్పూర్తిని కలిగించిన దార్శనికుడు, అరుదైన మానవుడు రతన్ టాటా అని స్పష్టం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు అని, దానిని ఎవరూ పూడ్చ లేరని అన్నారు.
ఆయన ఆవిష్కరణ, సమగ్రత , దాతృత్వం, వారసత్వం మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుందని స్పష్టం చేశారు కేసీఆర్. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రతన్ టాటా కలిసిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. గొప్ప విజన్ కలిగిన లెజండ్ అని పేర్కొన్నారు కేసీఆర్ .
రతన్ టాటా పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.