రతన్ టాటా దార్శనికుడు..ఆదర్శ ప్రాయుడు
ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్
అమరావతి – భారతదేశ దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మృతి చెందడం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. గురువారం ఎక్స్ వేదికగా స్పందించారు. భారత దేశం గొప్ప పారిశ్రామిక వేత్తను, అంతకు మించిన దాతృత్వం కలిగిన మహోన్నత మానవుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం.
రతన్ నావల్ టాటా మరణం టాటా గ్రూప్ కే కాదు యావత్ భారత దేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.. భారత పారిశ్రామిక రంగానికి కాదు, ప్రపంచ పారిశ్రామిక రంగానికి రతన్ టాటా ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు.
రతన్ టాటా నేతృత్వంలో ఉప్పు నుండి మొదలుకొని, విమానయాన రంగం వరకు భారత దేశపు అణువణువులో టాటా అనే పేరు ప్రతిధ్వనించేలా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారని కొనియాడారు. ఆయన హయాంలో టాటా అంటే భారతదేశపు ఉనికి గా అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టారు.
కేవలం పారిశ్రామిక వేత్తగా కాకుండా గొప్ప మానవతావాదిగా ఆయన సమాజానికి చేసిన సేవలు అనిర్వచనీయం, స్పూర్తి దాయకమని పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం.
ఈ బాధాకరమైన సమయంలో తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, టాటా గ్రూప్ సంస్థల కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అని పేర్కొన్నారు.