తిరుమలలో ఆకట్టుకున్న కళా ప్రదర్శన
తిరుమల గిరులు భక్తులతో కిట కిట
తిరుమల – శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చంద్రప్రభ వాహన సేవలో వివిధ రాష్ట్రల నుంచి విచ్చేసిన కళా బృందాలు అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆంద్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, కర్నాటక, బీహార్, పంజాబ్, మహారాష్ట్ర రాష్ట్రాలలో 16 కళా బృందాలు, 416 మంది కళాకారులు పాల్గొని తమ తమ కళాకృతులతో స్వామి వారిని ఆట పాటలతో సేవించున్నారు.
తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థులచే భరత నాట్యం, కూచిపూడి, జానపద నృత్యాలు ఆహుతులను కట్టిప డేశాయి. బీహార్ కు చెందిన ఉమాశంకర్ బృందం ప్రదర్శించిన బీహారీ జానపద నృత్యం, కర్నాటక రాష్ట్రానికి చెందిన రూపశ్రీ బృందం ప్రదర్శించిన చంద్రకళా నృత్యం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నాగలక్ష్మి బృందం ప్రదర్శించిన మహారాష్ట్ర తాళ వాయిద్యాలు, పంజాబ్ రాష్ట్రానికి చెందిన భవీంద్రథోడ్ బృందం ప్రదర్శించిన లుడ్డీ అనే ఆ రాష్ట్ర జానపద నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
కర్నాటకకు చెందిన గౌరీ బృందం ప్రదర్శించిన యక్షగానం, విజయవాడకు చెందిన, రాజేశ్వరరావు బృందం ప్రదర్శించిన చెక్క భజనలు పలమనేరుకు చెందిన సుబ్రహ్మణ్యం బృందం ప్రదర్శించిన కీలుగుఱ్ఱం, విశాఖపట్నంకు చెందిన పి.శ్రీదేవి బృందం ప్రదర్శించిన శ్రీకృష్ణ లీలలు రూపకం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎ.పాపారావు బృందం ప్రదర్శించిన డప్పు విన్యాసాలు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పి.సుమన్ బృందం, హైదరాబాదుకు చెందిన ఎస్.రాజేశ్వరి బృందం, తిరుమలకు చెందిన డి. శ్రీనివాసులు కోలాట బృందాల ప్రదర్శనలు తిరుపతికి చెందిన డాక్టర్ మురళీ కృష్ణ బృందం ప్రదర్శించిన రామావతారం రూపకం నయన మనోహరంగా సాగింది.