ఘనంగా బంగారు గొడుగు ఉత్సవం
అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవం
తిరుమల -శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనవాయితీగా నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవం తిరుమలలో ఘనంగా జరిగింది. అక్టోబరు 11వ తేదీ శుక్రవారం శ్రీవారి రథోత్సవాన్ని పురస్కరించుకొని అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయం మేరకు ముందురోజు శ్రీవారి కల్యాణకట్ట సిబ్బంది ఆధ్వర్యంలో నూతన ఛత్రస్థాపనాన్ని చేస్తారు. ఇందు కోసం ప్రధాన కల్యాణకట్టలో బంగారు గొడుగుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో సి హెచ్ వెంకయ్య చౌదరి కి అప్పగించారు.
ఈ సందర్భంగా టీటీడీ ఈవో మీడియాతో మాట్లాడారు. తిరుమలలో మొట్టమొదటి మంగల కట్ట (కళ్యాణ కట్ట)ను ఏర్పాటుచేసి యాత్రికులకు తలనీలాలు సమర్పించుకునే వసతి కల్పించిన పంతులు గారి వంశస్థులు వంశ పారంపర్యంగా శ్రీవారి రథానికి గొడుగు సమర్పించడం ఎంతోకాలంగా ఆచారంగా వస్తోందన్నారు.
శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రారంభమైన ఈ ఆచారం ఆ తర్వాత మహంతుల పాలనలో కూడా కొనసాగిందని చెప్పారు. 1946వ సంవత్సరంలో పంతులు వంశస్తులైన ధర్మకర్త శివరామయ్య, టీటీడీకి మధ్య జరిగిన ఒప్పందం మేరకు కళ్యాణకట్టను టీటీడీకి అప్పగించారని తెలిపారు.
అప్పట్లో జరిగిన ఒప్పందం మేరకు స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంలో పంతులు వంశస్థులు బంగారు గొడుగుకు పూజలు నిర్వహించి తిరుమల మాడ వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామివారి రథానికి బంగారు గొడుగు ప్రతిష్టించే ఆచారం కొనసాగుతోందన్నారు.
పంతులు వంశస్తులైన శివరామయ్య కుమారుడు రామనాథన్ గత 40 సంవత్సరాల నుండి బంగారు గొడుగులకు పూజలు నిర్వహించి కళ్యాణకట్ట నుండి నాలుగుమాడ గుండా మేళ తాళాలతో ఊరేగింపుగా వెళ్ళి స్వామివారి రథానికి సమర్పిస్తున్నారని, ఇది ఆయన పూర్వజన్మ సుకృతమని చెప్పారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, కల్యాణకట్ట డెప్యూటీ ఈవో వెంకటయ్య, ఏఈవో రమాకాంతరావు తదితరులు పాల్గొన్నారు.