ఆరోపణలు అబద్దం విమర్శలు అర్థరహితం
నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్
హైదరాబాద్ – గత ప్రభుత్వంపై నిరాధారణ ఆరోపణలు చేయడం దారుణమన్నారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్. లక్షా 60 వేల జాబ్స్ నింప లేదని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పగలరా అని సవాల్ చేశారు. వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. టీచర్ల నియామక పత్రాల పంపిణీ సందర్భంగా సీఎం వాడిన భాష దారుణంగా ఉందన్నారు. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటం భావ్యం కాదన్నారు.
కేసీఆర్ హయాంలో రికార్డ్ స్థాయిలో జాబ్స్ ఇచ్చామన్నారు. కానీ తాము సరిగా చెప్పుకోలేక పోయామని వాపోయారు. మార్కెటింగ్ లో, పీఆర్ లో రేవంత్ రెడ్డిని మించినోడు లేరంటూ ఎద్దేవా చేశారు వినోద్ కుమార్. తానంతకు తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానని చెప్పాడని గుర్తు చేశారు.
ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏయే శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో గుర్తించారా అని ప్రశ్నించారు.
తాము ఏమేం జాబ్స్ నింపామన్నది ఇప్పుడు పని చేస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని అడిగితే తెలుస్తుందన్నారు.
డిసెంబర్ లోపు 2 లక్షల జాబ్స్ ఇస్తామన్నారు..ముందు వాటిని భర్తీ చేసేందుకు దృష్టి సారించాలని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమంపై తుపాకీ పెట్టిన రేవంత్ రెడ్డికి తన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.