సీట్ బెల్ట్ ధరించండి సెల్ఫీ దిగండి – సలావుద్దీన్
టీజీపీడబ్ల్యూ అధ్యక్షుడు వాహనదారులకు పిలుపు
హైదరాబాద్ – రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు తెలంగాణ గిగ్, ప్లాట్ ఫారమ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూ ) జాతీయ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్. సీటు బెల్ట్ ధరించండి సెల్ఫీ దిగండి..మీ ప్రాణాలను రక్షించుకోండి అంటూ పిలుపునిచ్చారు.
శుక్రవారం ఆయన సీట్ బెల్ట్ ధరించి సెల్ఫీ తీసుకుని ప్రచారం ప్రారంభించారు. టిజిపిడబ్ల్యూ రహదారి భద్రతకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు షేక్ సలావుద్దీన్.
రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు తాము ఫోకస్ పెట్టామన్నారు. సెల్ఫీ విత్ సీట్ బెల్ట్ ను ఒక ఉద్యమంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సోషల్ మీడియా ప్రచారం డ్రైవర్లు మాత్రమే కాకుండా ప్రయాణికులు కూడా ప్రయాణిస్తుండగా సీట్ బెల్టులు ధరించాల్సిన అవసరాన్ని ప్రోత్సహిస్తుందన్నారు.
ప్రయాణం సందర్బంగా వాహనాలు నడిపే వారు, అందులో కూర్చున్న వారంతా విధిగా సీట్ బెల్టును ధరించాలని, దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అన్నారు షేక్ సలావుద్దీన్.
ఇదిలా ఉండగా 2016లో మొదట ప్రారంభించిన సెల్ఫీ విత్ సీట్ బెల్ట్ ఛాలెంజ్ భారత దేశ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం పొందిందని స్పష్టం చేశారు. బెల్ట్ లను ధరించడం వల్ల ప్రాణాలతో , గాయాల బారి నుండి బయట పడే అవకాశం ఉందన్నారు.
2022లో సర్కారు నివేదిక ప్రకారం ఇండియాలో సీట్ బెల్టు ధరించక పోవడం వల్ల 16,715 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపిందన్నారు. ఇందులో 8,384 మంది డ్రైవర్లు, 8,331 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. మొత్తం 4,61,312 రోడ్డు ప్రమాదాలు సంభవించగా, 1,68,491 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అంతే కాకుండా 4,43,366 మంది గాయపడినట్లు నివేదిక వెల్లడించింది.
సెల్ఫీ విత్ సీట్ బెల్టు ధరించాలని చేసిన అవగాహన కార్యక్రమాల కారణంగా, 2023 నాటికి ముందు సీట్లో ఉన్న వారు సీట్ బెల్ట్ ధరించడం 83 శాతానికి పెరిగిందన్నారు. అయితే ఈ ప్రచారానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మద్దతు తెలిపారని వెల్లడించారు షేక్ సలావుద్దీన్.
తమ ఛాలెంజ్ ను మంత్రి స్వీకరించాలని, సీట్ బెల్ట్ ధరించి సెల్ఫీ దిగాలని, మీరు కూడా ఈ ప్రచారానికి సంపూర్ణ మద్దతు తెలియ చేయాలని పిలుపునిచ్చారు.