DEVOTIONAL

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు విజ‌య‌వంతం

Share it with your family & friends

శ్రీవారి మూల‌మూర్తి, వాహ‌న సేవ‌ల‌ ద‌ర్శ‌నం
తిరుమల – శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన‌ట్లు, సామాన్య భ‌క్తుల‌కు ఎలాటి ఆసౌక‌ర్యాం క‌లుగ‌కుండా టీటీడీలోని అన్ని విభాగాలు స‌మ‌న్వ‌యంతో సేవ‌లందించిట్లు టీటీడీ ఈవో జె.శ్యామ‌ల‌రావు చెప్పారు.

టీటీడీ సిబ్బంది సంయ‌మనంతో, ప్ర‌ణాళిక బ‌ద్ధంగా, సీనియ‌ర్ అధికారుల ప‌ర్య వేక్ష‌ణ‌లో సేవ‌లందించార‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా టీటీడీ ఏర్పాటు చేసిన సౌక‌ర్య‌ల‌పై భ‌క్తులు సంతృప్తి వ్య‌క్తం చేశార‌న్నారు.

తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఈవో శ్యామ‌ల రావు మీడియాతో మాట్లాడారు. ⁠ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అక్టోబ‌రు 4వ తేదీన శ్రీవారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించార‌ని, 5న పాంచ‌జ‌న్యం విశ్రాంతి భ‌వ‌నం వెనుక వైపున రూ. 13.45 కోట్ల‌తో నూత‌నంగా నిర్మించిన వ‌కుళమాతా వంట‌శాల‌ను ప్రారంభించారని పేర్కొన్నారు.

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌కు 6 ల‌క్ష‌ల మందికి పైగా భ‌క్తులు శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నార‌ని ఈవో చెప్పారు. 15 ల‌క్ష‌ల మంది భ‌క్తులు శ్రీ‌వారి వాహ‌న సేవ‌లు వీక్షించార‌ని అన్నారు. ⁠గరుడ సేవ నాడు 82,043 మంది దర్శించుకున్నారని తెలిపారు. కాగా, గరుడ సేవ‌లో దాదాపు 3.5 లక్షల మంది భక్తులు పాల్గొన్నారని పేర్కొన్నారు ఈవో. మొత్తం 30 ల‌క్ష‌ల ల‌డ్డూలు విక్రించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. హుండీ ప‌రంగా రూ. 26 కోట్లు వ‌చ్చాయ‌ని తెలిపారు ఈవో.

2.60 ల‌క్ష‌ల మంది స్వామి వారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించార‌ని పేర్కొన్నారు. భ‌క్తుల‌కు 32,713 గ‌దులు కేటాయించామ‌న్నారు. ⁠బ్రహ్మోత్సవాల్లో 475 లక్షల గ్యాలన్ల నీటి వినియోగం జ‌రిగింద‌న్నారు.

క‌ల్యాణ‌వేదిక వ‌ద్ద వివిధ విభాగాల ద్వారా ఏర్పాటు చేసిన ఫ‌ల పుష్ప ప్ర‌ద‌ర్శ‌న నాడు -నేడు కాన్సెప్ట్‌తో ఫోటో ఎగ్జిబిష‌న్‌, అట‌వీ, శిల్ప క‌ళాశాల‌ల‌చే ఏర్పాటు చేసిన‌ ఎగ్జిబిష‌న్లు భ‌క్తుల ప్ర‌శంస‌లు అందుకున్నాయ‌ని తెలిపారు ఈవో.

తిరుమ‌ల‌లో ప‌లు ప్రాంతాల్లో దేవతామూర్తుల విద్యుత్‌ కటౌట్ల‌తోపాటు, 32 పెద్ద డిజిట‌ల్ స్క్రీన్లు ఏర్పాటు. ఇందులో నాలుగు మాడ వీధుల‌లో 23, ప్ర‌ధాన కూడ‌ళ్ళ‌లో 9, ప్ర‌త్యేకంగా తిరుప‌తిలో 7 డిజిట‌ల్ స్క్రీన్లు ఏర్పాటు చేశామ‌న్నారు.

⁠బ్రహ్మోత్సవాల 8 రోజుల్లో 26 లక్షల భోజనాలు, అల్పాహారం అందించామ‌న్నారు. ⁠గరుడ సేవ నాడు 8.71 లక్షల మందికి అన్న ప్రసాదాలు, అల్పాహారం, 3.47 లక్షల మందికి టి, కాఫి, పాలు, బాదం పాలు, 4 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 4 ల‌క్ష‌ల తాగునీరు బాటిళ్ళు, స్నాక్స్‌గా సుండ‌లు, బిస్కెట్లు అందించడం జరిగిందని చెప్పారు జె. శ్యామ‌ల రావు.

వైద్య సేవ‌ల ప‌రంగా 45 మంది డాక్టర్లు, 60 మంది పారామెడికల్‌ సిబ్బందిని, 13 అంబులెన్సులు వినియోగించడం జరిగింద‌న్నారు. ⁠68 వేల మందికి పైగా భక్తులకు వైద్య సేవలు అందించిన‌ట్లు తెలిపారు.

తిరుమ‌ల‌లో మెరుగైన పారిశుద్ధ్యం కోసం 1365 మంది సిబ్బంది, గ‌రుడ సేవ రోజు అద‌నంగా 600 మంది సిబ్బంది ఏర్పాటు చేశామ‌న్నారు.

⁠హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 18 రాష్ట్రాల నుండి వ‌చ్చిన 261 కళాబృందాల్లో 6,884 మంది కళాకారులు క‌ళా రూపాల‌ను ప్ర‌ద‌ర్శించారు. వాహ‌న సేవ‌ల‌తో పాటు తిరుమ‌ల‌, తిరుప‌తిలో ప్రదర్శించిన కళాకృతులు విశేషంగా అకట్టుకున్నాయ‌ని చెప్పారు.

⁠శ్రీవారి ఆలయంతో పాటు ప‌లు కూడ‌ళ్ళు, అతిథి గృహాల వ‌ద్ద శోభాయమానంగా పుష్పాల అలంకరణలు, పుష్ప ప్రదర్శన భ‌క్తుల‌ను అల‌రించింద‌ని అన్నారు. బ్ర‌హ్మోత్స‌వాల‌లో 40 టన్నులు పుష్పాలు, 3.50 లక్షల కట్‌ ఫ్లవర్స్‌, 80 వేల సీజనల్ ఫ్లవర్స్ వినియోగించామ‌న్నారు ఈవో.

⁠రాంభగీచా-2లో మీడియా సెంటర్, క‌ల్యాణ వేదిక వ‌ద్ద నాడు – నేడు ఫొటో ఎగ్జిబిష‌న్‌ ఏర్పాటు చేశామ‌న్నారు. ⁠దాదాపు 7 రాష్ట్రాల నుండి విచ్చేసిన 4 వేల‌ మంది శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలు అందించిన‌ట్లు చెప్పారు.

⁠గ‌తంలో ఉన్న 5 స‌మాచార కేంద్రాల‌తో పాటు తిరుమ‌ల‌లో మ‌రో 5 స‌మాచార కేంద్రాలు, తిరుప‌తిలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశామ‌న్నారు. అదేవిధంగా భ‌క్తుల‌కు విరివిగా స‌మాచారం ఇచ్చేందుకు శ్రీ‌వారి సేవ‌కుల స‌హ‌కారంతో దాదాపు 11 ప్రాంతాల‌లో మే ఐ హెల్ప్ యు కౌంట‌ర్ల‌ను నిర్వ‌హించామ‌న్నారు.

టీటీడీ కాల్ సెంట‌ర్, క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్, స‌మాచార కేంద్రాలు, మీడియా, శ్రీ‌వారి సేవ‌కుల ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు భ‌క్తుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ వారికి మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించిన‌ట్లు చెప్పారు.

తిరుమ‌ల‌లో భ‌క్తుల‌ను ఒక ప్రాంతం నుండి మ‌రోక ప్రాంతానికి ఉచితంగా ర‌వాణా చేసేందుకు 14 ధ‌ర్మ ర‌థాల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు.

9.53 ల‌క్ష‌ల మంది ఎపిఎస్‌ఆర్‌టిసి ద్వారా తిరుమ‌ల‌కు రాక పోక‌లు సాగించార‌ని వెల్ల‌డించారు ఈవో. గరుడసేవ నాడు ఆర్‌టిసి బస్సులు తిరుపతి నుంచి తిరుమలకు 2,764 ట్రిప్పుల్లో 97,402 మంది భక్తులను చేరవేశాయ‌న్నారు. తిరుమల నుంచి తిరుపతికి 2,711 ట్రిప్పుల్లో 89,181 మంది భక్తులను తిరుమ‌ల కొండ పైకి చేర్చ‌డం జ‌రిగింద‌న్నారు.

⁠బ్ర‌హ్మోత్స‌వాల‌ను విజ‌యవంతం చేయ‌డంలో పాలు పంచుకున్న అర్చ‌క స్వాములు, అధికారులు, సిబ్బంది, క‌ళాకారులు, శ్రీ‌వారి సేవ‌కులు, ఎన్‌సిసి విద్యార్థుల‌కు అభినంద‌న‌లు తెలిపారు.

అలాగే, బ్ర‌హ్మోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు అన్నివిధాలా స‌హ‌క‌రించిన జిల్లా యంత్రాంగం, పోలీసు, ఆర్‌టీసీ, ఇత‌ర ప్ర‌భుత్వ విభాగాల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ జేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.