జిల్లా కలెక్టర్లతో హోం మంత్రి సమీక్ష
మరోసారి మంత్రి టెలి కాన్ఫరెన్స్
విశాఖపట్నం – రాష్ట్ర వాతావరణ శాఖ బంగాళా ఖాతంలో అల్ప పీడనం ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించడంతో ఏపీ కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను నేపథ్యంలో ఆదివారం మరోసారి కలెక్టర్లతో హోం మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి.
ఇదిలా ఉండగా ఎవరూ ఊహించని రీతిలో విశాఖ బీచ్ లో రక్షణ చర్యలను ఆకస్మికంగా పరిశీలించారు.
వీకెండ్, దసరా సెలవుల నేపథ్యంలో ట్రాఫిక్ , పార్కింగ్, సీసీ కెమెరాల ఏర్పాట్లపై ఆరా తీశారు.
సోమవారానికి బంగాళా ఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారుతుందన్న వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే తుపాను నుంచి ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది, ఆస్తి నష్టం కలగకుండా ఉండేలా నిరంతరం కీలక శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు.
తుపాను ప్రభావం ఉన్న జిల్లాల కలెక్టర్లకు సైతం తగు ఆదేశాలిచ్చారు. మత్స్యకారులు, రైతులు, గొర్రెల కాపరులు రాబోయే రెండు రోజులు తుపాను నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప బయటకి వెళ్ల వద్దని కోరారు.
విపత్తు నిర్వహణ శాఖ ద్వారా సందేశాలు, ఫోన్ లు చేసి అప్రమత్తం చేయాలని ఆదేశించారు. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలున్నాయన్న హెచ్చరికల ప్రకారం కలెక్టర్లు జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచాలని హోం మంత్రి మార్గనిర్దేశం చేశారు.
నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. తుపాను ప్రభావం ఉన్న అన్ని జిల్లాలు రాబోయే రెండు మూడు రోజులు జాగరూకతతో వ్యవహరించాలన్నారు.
ప్రజలను అప్రమత్తం చేసే సందేశాలు, ఫోన్ ల ద్వారా విపత్తు శాఖ ఎప్పటికప్పుడు వెళ్లాలని ఆ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా పొంగి పొర్లే అవకాశమున్న వాగులు, కాలువలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండేలా సూచనలివ్వాలన్నారు. విద్యుత్ స్తంభాలు, తీగలు,చెట్లు, హోర్డింగులు వంటి ప్రమాదాలకు ఆస్కారముండే ప్రాంతాల్లోనూ అన్ని శాఖలు సమన్వయంతో 24×7 అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.